Share News

వచ్చే నెలాఖరులోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:08 AM

జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్‌ రోడ్లు, సైడు కాలువల పనులను డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు.

వచ్చే నెలాఖరులోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా, హాజరైన అధికారులు

అధికారులకు కలెక్టర్‌ అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్‌ రోడ్లు, సైడు కాలువల పనులను డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో డ్వామా, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 1,140 కొత్త పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. వీటికి సంబంధించి మ్యాపింగ్‌ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ఒంగోలు, దర్శి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల పరిఽధిలోని మండలాల్లో చాలావరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. వారంరోజుల్లో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా పనులకు సంబంధించి వారంవారం లక్ష్యాలను నిర్దేశించుకొని ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జరిగిన పనులకు సంబంధించి బిల్లులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:08 AM