Share News

జిల్లాకు మళ్లీ ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:26 AM

కూటమి ప్రభుత్వంలో మలివిడత ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాలోనూ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. ముగ్గురు టీడీపీ నేతలకు అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలో వైసీపీ పాలకుల నుంచి తీవ్ర నిర్బంధాన్ని, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు.

జిల్లాకు మళ్లీ ప్రాధాన్యం
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, జీవీరెడ్డి, తేజశ్విని, విజయ్‌కుమార్‌

కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియామకం

జీవీరెడ్డి, మర్రెడ్డి, తేజస్వినిలకు అవకాశం

ప్రతిపక్షంలో ఉండగా క్రియాశీలకంగా

పనిచేసిన వారికి సముచిత స్థానం

జనసేన నుంచి విజయకుమార్‌కు అవకాశం

ఒంగోలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వంలో మలివిడత ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాలోనూ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. ముగ్గురు టీడీపీ నేతలకు అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలో వైసీపీ పాలకుల నుంచి తీవ్ర నిర్బంధాన్ని, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వారు వివిధ వేదికలపై పార్టీగళాన్ని బలంగా వినిపించారు. అలాగే జనసేనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని పర్చూరు సమన్వయకర్త విజయ్‌కుమార్‌కు చైర్మన్‌ గిరి లభించింది. నిబద్ధతతో పనిచేసిన టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సాంకేతిక నిపుణుల విభాగం అధ్యక్షురాలు పొడపాటి తేజస్వినిలకు కార్పొరేషన్‌ చైర్మన్లుగా అవకాశం దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు నెలలుగా నామినేటెడ్‌ పదవులపై విస్తృత కసరత్తు జరుగుతోంది. తొలివిడత సెప్టెంబరు ఆఖరులో 14మంది కీలక నేతలను కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమించారు. అందులో జిల్లా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. పలు ఉపకులాలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, ఇతర పలు సంస్థలు కలిపి మొత్తం 59 కార్పొరేషన్‌లకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆ జాబితాలోనూ జిల్లాకు ప్రాధాన్యం లభించింది. మూడు కార్పొరేషన్‌ చైర్మన్లు దక్కాయి. ముగ్గురూ తమతమ విభాగాలు, బాధ్యతలతో రాష్ట్రస్థాయిలో కీలకంగా పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు సుపరిచితులైనవారే. టీడీపీ అధికార ప్రతినిధిగా నిరంతరం గళంవిప్పుతూ వైసీపీ అరాచక పాలనపై ఐదేళ్లు అలుపెరగని రీతిలో మీడియా వేదికగా పోరాడిన జిల్లాకు చెందిన జీవీరెడ్డిని రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. మార్కాపురానికి చెందిన జీవీరెడ్డి ఉన్నత విద్యావంతుడు. వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెండెంట్‌. అనంతరం న్యాయ విద్య కూడా పూర్తిచేశారు. హైదరాబాద్‌లో సీఏగా పనిచేస్తూ జీవీరెడ్డి తొలుత కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో 2019లో టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో చేరారు. బలంగా పార్టీ వాయిస్‌ను వినిపిస్తూ వచ్చారు. వైసీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిలిచారు.


తెలుగు రైతుకు మరింత గుర్తింపు

మరో నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగురైతు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థి, యువజన రంగాల్లో సీపీఎంలో క్రియాశీలకంగా పనిచేసిన మర్రెడ్డి ముండ్లమూరు మండల వాసి. కాగా రైతు సమస్యలపై పనిచేస్తూ గుర్తింపు పొందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముండ్లమూరు మండల జడ్పీటీసీ సభ్యురాలిగా శ్రీనివాసరెడ్డి భార్య రమణమ్మ గతంలో పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి కొనసాగుతున్నారు. 2019లో పార్టీ ఓటమి అనంతరం తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. చురుగ్గా పనిచేస్తున్న మర్రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌గా నియమించారు.

భూమి ఫౌండేషన్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు

చిన్న వయస్కురాలైన పొడపాటి తేజస్వినిది ఒంగోలు సమీపంలోని మంగమూరు. చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భూమి ఫౌండేషన్‌ పేరుతో ఒంగోలు కేంద్రంగా పారిశుధ్యం, పరిశుభ్రత, పర్యావరణ అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రురాలైన తేజస్విని 2014 ఎన్నికలకు ముందు నుంచి తెలుగు సాంకేతిక నిపుణుల విభాగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత క్రియాశీలకంగా పనిచేశారు రాష్ట్రంలోనే కాక హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీ పాలనలోని అరాచకాలపై చైతన్యవంతం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పలుప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ యువతతో సమావేశాలు నిర్వహించి మద్దతుగా నిలిచేలా పనిచేశారు. ఆమెకు ప్రస్తుత జాబితాలో ఏపీ కల్చరల్‌ కమిషన్‌ చైర్మన్‌గా అవకాశం దక్కింది. విధులు, నిధులు ఏమిటి, ఆయా రంగాల్లో వారు ఏమేరకు సంబంధిత ప్రజలకు ఉపకరించేలా పనిచేస్తే అవకాశాలు ఎంతమేర అన్న విషయాలు పక్కనపెడితే జిల్లాకు నామినేటెడ్‌ పదవులలో సముచిత స్థానం ఈ విడత దక్కిందనే చెప్పాలి.

Updated Date - Nov 10 , 2024 | 02:26 AM