Share News

వృద్ధురాళ్లే టార్గెట్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:40 AM

జిల్లాలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాళ్లే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగుతోంది. ఇద్దరు వృద్ధులు దొంగల చేతిలో హత్యకు గురికాగా, మరో ఇద్దరు చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. ఇలాంటి వరుస ఘటనలతో జిల్లా ప్రజానీకం ఆందోళనకు గురవుతోంది.

వృద్ధురాళ్లే టార్గెట్‌
కమ్మపాలెంలో బాధిత వృద్ధురాలిని విచారిస్తున్న పోలీసులు (ఫైల్‌)

ఒంటరిగా ఉన్న వారికి మత్తు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న దొంగలు

వరుస ఘటనలతో ఆందోళన

తాజాగా సమతానగర్‌లో మరో ఉదంతం

ఒంగోలు (క్రైం), డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాళ్లే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగుతోంది. ఇద్దరు వృద్ధులు దొంగల చేతిలో హత్యకు గురికాగా, మరో ఇద్దరు చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. ఇలాంటి వరుస ఘటనలతో జిల్లా ప్రజానీకం ఆందోళనకు గురవుతోంది. ఎనిమిది నెలల వ్యవధిలో జిల్లాలో చోటుచేసు కున్న ఘటనలు మిస్టరీగా మిగిలాయి. ముఖ్యంగా ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తరహా దోపిడీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఒంటరిగా జీవిస్తున్న పండుటాకులు, కన్నబిడ్డలకు సైతం దూరంగా ఉంటున్న వారిని దొంగలు టార్గెట్‌ చేస్తున్నారు. వృద్ధులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరాణాలు అపహరించుకెళుతున్నారు. అనుమానం వస్తే దాడులకు పాల్పడుతున్నారు. అదేసమయంలో వృద్ధులు మత్తుమందు ఘాటుకు తట్టుకోలేక మృత్యవాతపడుతున్నారు. పదిరోజుల క్రితం ఒంగోలులోని సమతానగర్‌లో జరిగిన దోపిడీ ఘటనతో మహిళలే ఈ పనికి పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల జరిగిన వరుస ఘటనలు...

ఒంగోలు అంబేడ్కర్‌ భవన్‌ సమీపంలో నివాసముంటున్న తిరుమలశెట్టి పార్వతమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. మే 24న ఆమె శరీరంపై పెద్దగా గాయాలు ఏమి లేవు. మామిడికాయ తింటూ ఇంట్లో మృతిచెందింది. ఆమె వద్ద ఉన్న బంగారం ఆభరాణాలు దోపిడీ దొంగలు అపహరించుకెళ్లారు. అదేసమయంలో ఇంట్లో ఉన్న బీరువాను పెకలించారు. దీంతో ఇరుగుపొరుగు వారు గుర్తించి ఆసుపత్రిలో చేర్చగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

అదే తరహాలో జూన్‌ 18న ఒంగోలు రూరల్‌ మండలం ఉలిచిలో ఓ వృద్ధురాలు రాత్రివేళ వరండాలో నిద్రిస్తుండగా దొంగలు మత్తు మందును ఇచ్చి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. తెల్లవారిన తర్వాత చుట్టుపక్కల వారు వచ్చి చూస్తే అప్పటికే వృద్ధురాలు మృతిచెంది ఉంది.

కొత్తపట్నం మండలం మడనూరులో జూన్‌ 26న పట్టపగలు ఆళ్ల కృష్ణవేణమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా గుర్తుతెలియని మహిళ ఇంట్లో ఉన్న నిమ్మచెట్టు కాయలు కావాలని వచ్చింది. అక్కడ ఏమి జరిగిందో గాని కొద్దిసేపటికి వృద్ధురాలు స్పృహ కోల్పోయింది. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. అక్కడ కూడా ఒంగోలు అంబేడ్కర్‌ భవనం వద్ద జరిగినట్లు బీరువా పగలకొట్టి ఉంది. అయితే కృష్ణవేణమ్మను ఆమె బంధువులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకుంది.

ఒంగోలులోని కమ్మపాలెంలో పొన్నం సీతారావమ్మ (80) అనే ఒంటరి మహిళ రాత్రి సమయంలో బాత్‌రూంకు వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె లోపలికి వచ్చిన తర్వాత దాడి చేశారు. ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం సీతారావమ్మ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చింది. రెండు రోజుల అనంతరం మృతి చెందింది. ఈ ఘటన సెప్టెంబరు 25న చోటుచేసుకుంది.

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి దోపిడీ

తాజాగా పదిరోజుల క్రితం ఒంగోలులో మరో ఘటన చోటుచేసుకుంది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ మహిళ.. వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. స్థానిక సమతానగర్‌లో వృద్ధురాలు(65) నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు సంతానం. ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటుంది. ఇంట్లో మొదటి అంతస్థు ఖాళీగా ఉంది. ఈనెల 19వతేదీన ఓ మహిళ ఇల్లు అద్దెకు కావాలని వృద్ధురాలితో అడిగింది. ఆమె ఒంటరిగా ఉండటం గమనించింది. ఇల్లు చూసుకున్న తరువాత రేపు వస్తానని చెప్పి వెళ్లింది. మరుసటి రోజు తిరిగి వచ్చిన ఆ మహిళ, వృద్ధురాలితో మాటలు కలిపింది. ఆమెకు వేరుశనగ ముద్ద ఇచ్చి తినాలని చెప్పింది. తరువాత కొద్దిసేపటికి వృద్ధురాలు మత్తులోకి జారుకుంది. దీంతో ఆమె వద్ద ఉన్న ఆరు సవర్ల ఆభరణాలు తీసుకుని ఉడాయించింది.

ఆ మహిళ ఎవరు?

మడనూరులో కృష్ణవేణమ్మ ఇంటికి వచ్చిన గుర్తుతెలియని మహిళ ఎవరు అనేది ఇంతవరకు గుర్తించలేకపోయారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్మకాయలు కావాలి అని వచ్చిన మహిళ వృద్ధురాలు సృహకోల్పోయిన తర్వాత ఆభరణాలు, నగదు కోసం బీరువా పగలకొట్టిందా అనేది అంతు చిక్కడం లేదు. మహిళతోపాటుగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా అదే తరహాలో ఒంగోలు సుజాతానగర్‌లోనూ దోపిడీ జరిగింది. ఇందులోనూ మహిళే వచ్చినట్లు వృద్ధురాలు చెబుతున్నారు. మడనూరు కేసులో మాత్రమే కొద్దిపాటి క్లూ పోలీసులకు దొరికింది. ఇలా వరస ఘటనలకు కారణం ఒకే ముఠానా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 01:40 AM