Share News

గుంతలు లేని రోడ్లే లక్ష్యం

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:28 AM

గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ పాట్‌ హోల్‌ఫ్రీ (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధి మద్దులూరు గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రహదారికి రూ.20లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులను స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌తో కలిసి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ప్రారంభించారు.

గుంతలు లేని రోడ్లే లక్ష్యం
మద్దులూరులో రోడ్డు మరమ్మతులను ప్రారంభించి పరిశీలిస్తున్న కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్‌

మిషన్‌ పాట్‌ హోల్‌ఫ్రీ పేరుతో

మరమ్మతు పనులకు శ్రీకారం

రెండు నెలలపాటు కార్యక్రమం

జిల్లావ్యాప్తంగా పనులు ప్రారంభం

మద్దులూరులో పాల్గొన్న కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్‌

ఆర్‌అండ్‌బీలో వంద పనులకు రూ.13.76 కోట్లు మంజూరు

పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ రహదారులకూ మరమ్మతులు

ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు

జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అందుకు కారణం. ఐదేళ్లుగా కొత్త రోడ్లు వేయడం అటుంచి పాత వాటి మరమ్మతులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గజానికో గతుకు, పర్లాంగుకు పది గోతులు అన్న చందంగా తయారయ్యాయి. రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాలు ధ్వంసం కావడంతోపాటు వందలకొద్దీ జరిగిన ప్రమాదాలలో అనేక మంది మృత్యువాతపడ్డారు. రోజూ జిల్లాలో ఎక్కడోచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోడ్ల దుస్థితిపై దృష్టి సారించింది. వెంటనే మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. జిల్లాలోనూ శనివారం రోడ్ల మరమ్మతు పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రెండు నెలల్లో మొత్తం రోడ్లు బాగుచేయాలన్నదే సర్కారు సంకల్పం.

ఒంగోలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ పాట్‌ హోల్‌ఫ్రీ (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధి మద్దులూరు గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రహదారికి రూ.20లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులను స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌తో కలిసి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ప్రారంభించారు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. కనీస మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వకుండా ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, మునిసిపల్‌ ఇలా ఏశాఖకు సంబంధించిన రోడ్లు చూసినా దారుణంగా తయారయ్యాయి. కొద్ది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రహదారుల బాగుపై దృష్టి సారించింది. అన్ని రోడ్లకు నిధులు కేటాయించడంతోపాటు రెండు నెలలలోపు పూర్తిచేయాలంటూ అధికార యంత్రాంగానికి లక్ష్యం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పనులను టీడీపీ నేతలతో కలిసి అధికారులు ప్రారంభించారు.

భారీగా నిధులు మంజూరు

అన్ని విభాగాల్లోని రోడ్లను పరిశీలించి తక్షణ మరమ్మతులు అవసరమైన పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా గోతులు, గుంతలను పూడ్చి రోడ్లను సరిచేసే పనులను ముందుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పనులు ఏప్రాంతానికి ఆ ప్రాంతంలో ఎవరు తోచిన సమయంలో ఆశాఖల అధికారులు చేపట్టడం కాకుండా రాష్ట్రం మొత్తం ఒకేసారి కార్యక్రమాన్ని రూపొందించింది. శనివారం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లాలో ప్రారంభించారు. తదనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి,. కాగా జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.13.76 కోట్లతో వంద పనులను ఈ కార్యక్రమం కింద చేపట్టారు.


జిల్లావ్యాప్తంగా పనులు ప్రారంభం

అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలు, అధికారులు రోడ్ల పనులను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. సంతనూతలపాడు మండలం మద్దులూరులో కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు. కనిగిరి పట్టణ పరిధిలోని శంఖవరంలో రోడ్డు మరమ్మతుల పనులను అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. కొమరోలు మండలంలో గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి పనులను ప్రారంభించగా దర్శి పట్టణంతోపాటు కురిచేడులలో దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి స్వయంగా పాల్గొని రోడ్డు రోలర్‌ నడిపారు. పుల్లలచెరువు మండలంలో టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇతర ప్రాంతాల్లోనూ స్థానిక అధికారులు, అధికారపార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీలో మరో రూ.11 కోట్లతో 80 పనులు మంజూరు చేయనున్నారు. ప్రధానంగా రోడ్లపై గుంతలు పూడ్చడం, రోడ్డు పక్క మార్జిన్లు పటిష్టం, జంగిల్‌ క్లియరెన్స్‌, అత్యవసరమైన కల్వర్టుల నిర్మాణం తదితర పనులు ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నారు.

విశాఖలో పాల్గొన్న మంత్రి డాక్టర్‌ స్వామి

జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి విశాఖనగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న స్వామి శనివారం అక్కడ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో విశాఖ నగరంలోని శిరిపురం జంక్షన్‌ వద్ద గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మునిసిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణతో కలిసి ప్రారంభించారు.

Updated Date - Nov 03 , 2024 | 01:28 AM