పేదల ఇళ్లు పాడుబెట్టారు!
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:23 AM
జగన్ పాలనలో చేసిన నిర్లక్ష్యం పేదల గృహాలకు శాపంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్లను వైసీపీ సర్కారు కావాలనే పాడుబెట్టింది. పేదల సొంతింటి కలను చెరిపేసింది. నవరత్నాలంటూ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం జీప్లస్‌త్రీ భవనాలను చూసి ఓర్చుకోలేకపోయింది.
జగన్ పాలనలో అంతా నిర్లక్ష్యమే
పేదల సొంతింటి కల సాకారానికి టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు
వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం
నేడు అడవిని తలపిస్తూ సాలెగూళ్లుగా మారిన గృహాలు
60శాతం పనులతో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలు
పూర్తిచేయడానికి రూ.342.29 కోట్లు అవసరం
కూటమి ప్రభుత్వంపై అర్హుల్లో ఆశలు
జగన్ పాలనలో చేసిన నిర్లక్ష్యం పేదల గృహాలకు శాపంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్లను వైసీపీ సర్కారు కావాలనే పాడుబెట్టింది. పేదల సొంతింటి కలను చెరిపేసింది. నవరత్నాలంటూ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం జీప్లస్‌త్రీ భవనాలను చూసి ఓర్చుకోలేకపోయింది. అధికారంలోకి వచ్చే సమయానికి 60శాతం పనులు పూర్తయినా పట్టించుకోకపోగా, పైసా నిధులు విడుదల చేయలేదు. దానికితోడు లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని నవరత్నాలకు మళ్లించి ఘోరంగా మోసం చేసింది. దీంతో పట్టణ పేదల ఇళ్లు పాడుబడిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్హుల్లో ఆశలు మొదలయ్యాయి. వాటి నిర్మాణం పూర్తికి అవసరమైన నిధుల కోసం సర్కారు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒంగోలు, కార్పొరేషన్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదల సొంతింటి కల నెరవేరడానికి నిధుల సమస్య ఎదురైంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల ఇళ్లను పాడుబెట్టారు. పైసా ఖర్చుచేయ కుండా, లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. పట్టణ పేదల కోసం పక్కా ఇళ్లు నిర్మించి, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిలో జీప్లస్‌త్రీ నిర్మాణాలను చేపట్టి అర్హులైన వారికి ఇంటి పత్రాలు మంజూరు చేసింది. 60శాతం పనులు పూర్తిచేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అంతా తారుమారైంది. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లపై సీతకన్ను వేసింది. కనీస నిధులు కేటాయించకపోవ డంతోపాటు, పనుల గురించి పట్టించుకోకపోవ డంతో పట్టణ పేదల్లో ఇంటి బెంగ ఏర్పడింది. పైగా లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాటిని నవరత్నాలకు మళ్లించడంతో వారు గగ్గోలుపెట్టారు. ప్రస్తుతం సొంతింటి గృహప్రవేశం చేసే పరిస్థితి లేకపోగా, ఇంటిపై పొందిన రుణంతో వారిలో ఆందోళన మొదలైంది. నెలనెలా రుణం వాయిదా చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్లపై మరోసారి ఆశలు పెంచుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7,200 మందికి ఇళ్ల కేటాయింపులు జరిగాయి. దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన పనులు పూర్తిచేయడానికి రూ.342.29 కోట్ల అవసరం పూర్తిచేయడానికి రూ.342.29 కోట్ల అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 7,200 మంది టిక్కో ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు. అందులో 300 ఎస్‌ఎఫ్‌టీ లబ్ధిదారులు 4,800 మంది, 365 ఎస్‌ఎఫ్‌టీ లబ్ధిదారులు 1,296, 400 ఎస్‌ఎఫ్‌టీ లబ్ధిదారులు 1,104 ఉన్నారు. ఒంగోలులో ఫేజ్-2 కిందచింతల వద్ద 1,392, ఫేజ్-3 కింద కొప్పోలు వద్ద 2,736, గిద్దలూరులో ఫేజ్-3 కింద 1,248,కనిగిరిలో ఫేజ్-3 కింద చాకిరాల వద్ద 912, మార్కాపురంలో ఫేజ్-3 కింద పెదనాగులవరం రోడ్డులో 912 టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులు అర్హత పొందారు.
అడవిని తలపిస్తున్న భవన సముదాయాలు
వైసీపీ నిర్వాకంతో గడిచిన ఐదేళ్లలో జిల్లాలో టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత ఆ సముదాయాల పరిస్థితి చూస్తే ఇంటి గోడల నిర్మాణం పటిష్టంగానే ఉన్నా, ఫ్లోరింగ్ లేచిపోయి, మెట్లు పగిలిపోయి శిఽఽథిలావస్థకు చేరాయి. మరోవైపు అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగిపోవడంతో విషపురుగులు సంచరించడంతో ఆ ప్రాంతంలో కాలుపెట్టే పరిస్థితి లేదు. అర్ధంతరంగా ఆగిపోయిన పనులు నేటికి ఒక కొలిక్కి రాకపోవడంతో ఎండకు, వానకు, ఇనుము పాడై తుప్పుపట్టింది. కొప్పోలులో కనీస రహదారులు కూడా లేకపోగా, చింతల వద్ద నిర్మాణాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో భారీగా నీరు నిలిచి ప్రాంగణంలో కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. కట్టుబడి మొత్తం పూర్తయినా, తలుపులు, ఇతర మౌలిక వసతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే అధికారులు గతేడాది చివరికి కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. కానీ నేటికీ కేటాయింపుల జరగలేదు. టిడ్కో ఇళ్ల వాస్తవ పరిస్థితిని చూస్తే మరింత దయనీయంగా మారింది. ఇదిలా ఉండగా, నాడు పేదల సొంతింటి కల నిజం చేసేందుకు శ్రీకారం పలికిన టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.