Share News

డీసీసీబీ అధికారులపై విచారణాధికారి సీరియస్‌

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:58 PM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారుల తీరుపై విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు సీరియస్‌ అయినట్లు తెలిసింది. ప్రత్యక్ష విచారణను బ్యాంకులో పదిరోజులకుపైగా నిర్వహించిన ఆయన తుది నివేదికను కలెక్టర్‌కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

డీసీసీబీ అధికారులపై విచారణాధికారి సీరియస్‌

వివరణలు, పథకాల వివరాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ ఘాటుగా లేఖ

కలెక్టర్‌ దృష్టికి కూడా వారి తీరు

బ్యాంకు అధికారుల్లో కదలిక

నేడు కలెక్టర్‌కు నివేదిక

ఒంగోలు,నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారుల తీరుపై విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు సీరియస్‌ అయినట్లు తెలిసింది. ప్రత్యక్ష విచారణను బ్యాంకులో పదిరోజులకుపైగా నిర్వహించిన ఆయన తుది నివేదికను కలెక్టర్‌కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే అందుకు అవసరమైన బ్యాంకులోని ఆయా విభాగాల పర్యవేక్షణాధికారుల వివరణలను, అలాగే ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇచ్చిన జాబితాలను ఇవ్వాలని కోరారు. తన విచారణ అంతా పూర్తయినా ఆ వివరాలు, వివరణలు సకాలంలో అందక నివేదిక జాప్యం జరుగుతోందంటూ పలుమార్లు ఆయా విభాగాల పర్యవేక్షణ అధికారులను కోరారు. అయితే శనివారం రాత్రికి ఒకరిద్దరు మాత్రమే ఇవ్వగా సోమవారం ఆ విషయాన్ని ఆయన ప్రస్తుత బ్యాంకు సీఈవోగా ఉన్న అధికారిణి దృష్టికి తీసుకెళ్లారు. తాను పలుమార్లు చెప్తున్నా ఆశించిన విధంగా ఇతర అధికారుల నుంచి స్పందన లేదన్న విషయాన్ని సీఈవో చెప్పినట్లు సమాచారం. దీంతో లోకేశ్వరరావు బ్యాంకు అధికారుల తీరును ఘాటుగా ప్రశ్నిస్తూ రాతపూర్వకంగా నోటీసు ఇచ్చి ఆ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

దారిమళ్లించేందుకు యత్నాలు

తొలి నుంచి బ్యాంకు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి అనుకూలంగా వ్యవహరిస్తూ అవసరమైన పైళ్లను చూపకపోవడం, అక్కడ ఏమి జరగలేదన్న భావన వచ్చేలా విచారణ కమిటీపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికి లోకేశ్వరరావు కాస్తంత కఠినంగా వ్యవహరించి లోతుగా పరిశీలన చేశారు. అలా మొత్తం 62 ఫిర్యాదులపై విచారణ చేసిన ఆయన వాటిని ఎనిమిది విభాగాలుగా చేసి సంబంధిత విభాగాల పర్యవేక్షకులుగా ఉన్న డీజీఎం, ఏజీఎం స్థాయి అధికారులను రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ పథకాలైన జగనన్న పాల వెల్లువ, జగనన్న తోడు, సీహెచ్‌సీ గ్రూపుల పేరుతో ఇచ్చిన ట్రాక్టర్ల లబ్ధిదారులు, ఇతర పథకాల లబ్ధిదారుల జాబితాలను ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు. భవిష్యత్‌లో సెక్షన్‌ 51 విచారణ జరిగితే అందులో ఈ జాబితాలు కీలకం కానున్నాయి.


ఒకరిద్దరు మాత్రమే స్పందన

సదరు అధికారుల వివరణలు, ఈ జాబితాలను శనివారం సాయంత్రానికి ఇవ్వాలని కోరగా ఒకరిద్దరు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిని ప్రశ్నిస్తూ సోమవారం బ్యాంకు అధికారులపై విచారణాధికారి లోకేశ్వరరావు సీరియస్‌ అవుతూ ఘాటుగా నోటీసు ఇచ్చి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలాగే వ్యవహరిస్తే ఈ విషయాన్ని తన నివేదికలో పేర్కొంటానని స్పష్టం చేసినట్లు తెలిసింది. బ్యాంకు అధికారులు మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు బ్యాంకులోనే ఉండి సంబంధిత పథకాల వివరాలు, అలాగే ఆయా విభాగాలలో గుర్తించిన లోపాలపై బ్యాంకు సీఈఓ పేరుతో విచారణాధికారికి ఇచ్చినట్లు సమాచారం. వాటిని బుధవారం పరిశీలించిన ఆయన అన్నింటిని కలిపి పూర్తి నివేదికను గురువారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు ఇవ్వనున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 20 , 2024 | 11:58 PM