Share News

నష్టం అపారం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:15 AM

జిల్లాలో తాజాగా కురిసిన అకాల వర్షం పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రత్యేకించి ప్రస్తుతం రబీ పంటలు అధిక సాగు జరిగే జిల్లా దక్షిణ, తూర్పు ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతంలోనే భారీవర్షాలు పడటమే అందుకు ప్రధాన కారణం. నెలరోజుల వ్యవధిలోపు వేసిన పొగాకు, శనగ పైర్లు ఉరకెత్తిపోతుండగా మినుము పైరు కుళ్లిపోతోంది. ఇక ఖరీ్‌ఫలో వేసిన పొగాకు, మిర్చి, వరి పంటల దిగుబడులపైనా వర్షాల ప్రభావం కనిపిస్తోంది. వర్షాలు తెరపివ్వడంతో రైతులు పొలాల్లోకి వెళ్లి పైర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నీటిని బయటకు పంపడటంతో పాటు మొక్కలను కాపాడుకునేందకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు.

నష్టం అపారం
మోటార్‌తో పొలంలోని నీటిని వెలుపలకు పంపుతున్న దృశ్యం

ఇతర పంటలపైనా వర్షం ప్రభావం

రూ.100 కోట్లకుపైనే పెట్టుబడి నీటిపాలు

వర్షం తెరపివ్వడంతో పంట రక్షణపై రైతులు దృష్టి

ఐదు రోజుల్లో 74.70 మి.మీ సగటు వర్షపాతం

జిల్లాలో తాజాగా కురిసిన అకాల వర్షం పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రత్యేకించి ప్రస్తుతం రబీ పంటలు అధిక సాగు జరిగే జిల్లా దక్షిణ, తూర్పు ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతంలోనే భారీవర్షాలు పడటమే అందుకు ప్రధాన కారణం. నెలరోజుల వ్యవధిలోపు వేసిన పొగాకు, శనగ పైర్లు ఉరకెత్తిపోతుండగా మినుము పైరు కుళ్లిపోతోంది. ఇక ఖరీ్‌ఫలో వేసిన పొగాకు, మిర్చి, వరి పంటల దిగుబడులపైనా వర్షాల ప్రభావం కనిపిస్తోంది. వర్షాలు తెరపివ్వడంతో రైతులు పొలాల్లోకి వెళ్లి పైర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నీటిని బయటకు పంపడటంతో పాటు మొక్కలను కాపాడుకునేందకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు.

ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం కురిసిన వర్షం జిల్లాలో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఖరీఫ్‌ సీజన్‌లో, తూర్పు, దక్షిణప్రాంతంలో రబీ సీజన్‌లో అధికంగా పంటలు సాగుచేస్తారు. అలా నెలరోజులుగా తూర్పు, దక్షిణ ప్రాంతాలైన ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కనిగిరి, కొండపి నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో విస్తారంగా పొగాకు, శనగ సాగు జరుగుతుండగా కొన్నిచోట్ల రబీ ఆరంభంలోనే మినుము, అలసంద, వరి నాట్లు వేశారు. ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాలతో 50వేల ఎకరాల విస్తీర్ణంలో పైర్లు దెబ్బతినగా సగటున ఎకరాకు రూ.20వేల వంతున చూసినా రూ.100 కోట్ల మేర రైతాంగం పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో డిసెంబరులో పెద్దగా వర్షాలు ఉండవు. వర్షాల సీజన్‌ ముగిసి మంచు, చలి ప్రారంభమవుతుంది. ఈ నెల మొత్తం మీద జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 45.10 మి.మీ. అయితే ఊహించని రీతిలో ఐదు రోజుల్లో ఏకంగా 74.70 మి.మీ నమోదైంది. అందులో తూర్పు, దక్షిణ ప్రాంతంలోని దాదాపు పది, పన్నెండు మండలాల్లో 100 నుంచి 200 మి.మీ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

పైర్లన్నీ నీళ్లలోనే..

కాగా అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో పొగాకు లేత తోటలు, తాజాగా వేసిన నాట్లు అలాగే శనగ పంట మొలక వచ్చి ఉన్నాయి. కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలలో ముదురు పొగతోటలు, అలాగే మినుము కాయదశలో ఉన్నాయి. అలాంటి పంటలన్నీ దెబ్బతిన్నాయి. లేత పొగతోటలు, తాజాగా వేసిన మొక్కలు ఉరకెత్తిపోతుండగా శనగ నీళ్లలోనే నాని పోతుంది. మినుము కాయ నాని పగిలి విత్తనాలు కుళ్లిపోతుండగా ముదురు పొగతోటలు మడ్డికారి నాణ్యత పోతోంది. ఇక కోతకు వచ్చిన వరి, మిర్చి, కంది పంటలకు నష్టం వాటిల్లింది. అధికారిక ప్రాథమిక అంచనా ప్రకారం.. జిల్లాలో పది మండలాల్లోని 103 గ్రామాల్లో సుమారు 26వేల ఎకరాలలో పంటలు దెబ్బతిని 7,650 మంది రైతులు నష్టపోయారు. అవన్ని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లోనివే. పంట చేతికొచ్చే దశలో ఉండి దెబ్బతిన్న వాటినే అధికారులు అంచనా వేశారు.

లెక్కలోకి రాని లేతతోటలు, మొలకలు

అయితే లేత పొగతోటలు, తాజాగా వేసిన నాట్లు, శనగ మొలక వచ్చిన భూములు కొండపి, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు నియోజకవర్గాలు అలాగే దర్శి, వైపాలెం నియోజకవర్గాల్లో వరి, మిర్చిపై అధికారులు దృష్టిపెట్టలేదు. వాటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఎంత తక్కువ చూసినా కనీసం 50వేల ఎకరాలలో పంటలు దెబ్బతిని సుమారు రూ.100 కోట్ల మేర పెట్టుబడులు నీటి పాలయ్యాయి. ఉరకెత్తిన పొగ తోటలు, నీళ్లలో నానిపోయిన శనగ పైర్లు తిరిగి వేసుకోవాల్సి ఉండగా ఇతర పంటలపై వర్షాలు ప్రభావంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోనున్నారు. కాగా శుక్రవారం వర్షం తెరపి ఇవ్వడంతో పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బయటకు పంపి పంటలను కాపాడుకునే వైపు రైతులు దృష్టిసారించారు. అయితే మళ్లీ వర్షం పడితే మొత్తం పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:15 AM