ఐదేళ్లలో ఊడ్చేశారు!
ABN , Publish Date - Nov 07 , 2024 | 02:36 AM
ఒంగోలు నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో నిర్వహణ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఐదేళ్లుగా పట్టణాల ప్రగతిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిఽధులను విడుదల చేయలేదు. దీంతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులే ఆధారమయ్యాయి.
గత పాలకుల నిర్వాకం
కార్పొరేషన్ ఖజానా ఖాళీ
పన్నులే ఆదుకోవాల్సిన పరిస్థితి
నగరపాలక సంస్థపై బకాయిల బండ
రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సిన పరిస్థితి
బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
అభివృద్ధి జరగాలంటే నిధులు అవసరం. అయితే గత పాలకుల నిర్వాకంతో నేడు ఒంగోలు నగరపాలక సంస్థలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు లేకపోగా, పన్నుల రూపంలో వసూలైన వాటిని కూడా కరిగించేశారు. దీంతో కార్పొరేషన్‌పై బకాయిల భారం పడింది. అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కార్యాలయ నిర్వహణకు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిన్న మొన్నటి వరకూ ఆర్‌ఐలుగా ఉన్నవారు, అలాగే సచివాలయ సెక్రటరీలు సైతం పన్నులు పూర్తిస్థాయిలో వసూలు చేయలేదు. పైనుంచి నిధులు కేటాయించకపోవడంతో కార్పొరేషన్ ఖజానా అడుగంటింది. దీంతో నెలనెలా నిర్వహణ ఖర్చు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఒంగోలు, కార్పొరేషన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో నిర్వహణ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఐదేళ్లుగా పట్టణాల ప్రగతిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిఽధులను విడుదల చేయలేదు. దీంతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులే ఆధారమయ్యాయి. అవి కూడా పూర్తిస్థాయిలో వసూలు చేయకపోవడంతో కార్పొరేషన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ఖాజానాలో రూ.3.5 కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పన్నులు, ఇతరత్రా రూ.39 కోట్లు రావాల్సి ఉంది. ఇక చెల్లించాల్సిన బకాయిలు రూ.100 కోట్ల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధి పనులను వదిలేశారు
వాస్తవానికి ప్రజలు పన్నుల రూపంలోచెల్లించిన నిధుల (జనరల్ ఫండ్)తో రోడ్లు, కాలువలు, భవనాల నిర్మాణం, ప్రహరీలు, పార్కుల అభివృద్ధి, పారిశుధ్యం మెరుగు, తాగునీటి సరఫరా, కొత్తగా పైపులైనులు, పాతవాటికి మరమ్మతులు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి తదితర పనులు చేయాల్సి ఉంది. అయితే అభివృద్ధి పనులను వదిలేసి, అత్యవసర పనులైన పారిశుధ్యం, తాగునీటి సరఫరాకే పరిమితమయ్యారు. దీంతో ఉన్న నిధులు కరిగిపోయాయి. ప్రస్తుతం ఖజానాలో రూ.3.5 కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అందులో రూ.2.5 కోట్లు గత కొన్నినెలలుగా నీటి సరఫరా ట్యాంకర్ల బిల్లులకు చెల్లించాల్సి ఉంది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్లు ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగాం (నాక్) కింద చేపట్టిన పనులకు ఖర్చుచేయాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా రెవెన్యూ సెక్షన్‌లో నెలకొన్న అలసత్వంతో ఆస్తి, తాగునీటి పన్నుల రూపంలో రూ.20 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి.
ఆదాయం కన్నా.. అప్పులే అధికం
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం కంటే అప్పులే అధికంగా కనిపిస్తున్నాయి. పైపులైను లేని శివారు కాలనీలకు తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్ల బిల్లులు రూ.2.5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నేటికీ ఒక్క పైసా కూడా చెల్లించకపోవడంతో ట్యాంకర్ల నిర్వహణ భారంగా మారిందంటూ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. మరోవైపు గత ఐదేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.50 కోట్ల వరకు బకాయిలు ఉండగా, వాటిని చెల్లించకపోవడంతో కొత్తగా పనులు చేపట్టేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ప్రతిపాదించిన టెండర్లు పొంది పనులు ప్రారంభించని పనులు సైతం రూ.80 కోట్లకుపైన ఉన్నాయి. విద్యుత్ బిల్లులు బకాయిలు రూ.10 కోట్లు, మార్కెటింగ్ శాఖకు ఇవ్వాల్సినవి రూ.5కోట్లు, అమృత్ రుణం తీసుకున్న వాటికివడ్డీ కింద రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది.
బకాయిలపై తర్జనభర్జన
నెలనెలా ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వాటర్ వర్క్స్, పార్కుల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇంతవరకు కార్పొరేషన్ నుంచి చెల్లించాల్సిన బాకీలు కనిపిస్తుండగా, రావాల్సిన ఆదాయం మాత్రం అందులో సగం కూడా కనిపించడం లేదు. పన్నులు, కార్పొరేషన్ కాంప్లెక్స్‌ల అద్దెలు, ఇతరత్రా కలిపి రూ.20 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఐదు నెలలుగారూ.9 కోట్లు, అలాగే, బీపీఎస్ స్కీమ్ ద్వారా చెల్లించిన సొమ్ముకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు వరకు రావాల్సి ఉంది. మరోవైపు తమ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని కాంట్రాక్టర్లు వత్తిడి చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు రావాల్సిన ఆదాయం, చెల్లించాల్సిన బకాయిలపై తర్జనభర్జన పడుతున్నారు.
పన్నుల వసూళ్ల బాధ్యత పాత ఆర్‌ఐలదే
అవినీతికి నిలయంగా మారిన రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేస్తూ మునిసిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు పనిచేసిన వారిని పూర్తిగా పక్కనపెట్టి కొత్త వారిని ఆర్‌ఐలుగా నియమించారు. అయితేఇప్పటివరకూ పనిచేసిన ఆర్‌ఐలు వారి వార్డులలో ఉన్న పన్నుల బకాయిల వసూళ్ల బాధ్యత వారిదేనంటూ ఉత్వర్వులు జారీ చేశారు. సీట్లు మారినా వసూలు చేయాల్సిందేనని ఆదేశించారు. షాపింగ్ కాంప్లెక్స్‌ల బకాయిల బాధ్యత పాత ఆర్‌ఐలకు అప్పగించారు. నివాసాలు, ప్రైవేటు షాపులు, నీటి పన్నులు వసూళ్ల బాధ్యతను సచివాలయ సెక్రటరీలకు ఇచ్చారు. వారికి రోజువారీ కలెక్షన్ టార్గెట్లు నిర్ణయించడంతోపాటు ఏరోజుకారోజు నివేదికలు అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి దాదాపు నూరుశాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంచితే నూతన ఆర్‌ఐలు వారికి కేటాయించిన డివిజన్లలో పన్నులు వసూలు చేయడంతోపాటు ఇంకా వేయని వాటిని గుర్తించాలన్నారు.
కూటమిపై కోటి ఆశలు..
కార్పొరేషన్ ఆర్థికంగా బలపడాలన్నా, చేపట్టిన పనులు ముందుకు సాగాలన్నా కూటమి ప్రభుత్వంపై కార్పొరేషన్ యంత్రాంగం కోటి ఆశలు పెట్టుకుంది. ఒకవైపు పన్నుల రూపంలో తమకు రావాల్సిన సొమ్ము వసూళ్లపై దృష్టిసారిస్తూ, మరోవైపు చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం కూడా అవసరం ఉందని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతోపాటు, సమస్యల పరిష్కారం, అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరినట్లు సమాచారం. మొత్తంగా కార్పొరేషన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అవసరమైన మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
ఖర్చు తగ్గించి ఆదాయమార్గాల పెంపునకు చర్యలు
ఆర్థిక లోటును అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం ఉన్న బకాయిల చెల్లింపు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.500 కోట్లు అవసరం. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. వాటితోపాటు ఖర్చులను తగ్గించి, కార్పొరేషన్ ఆస్తులను వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా దృష్టి సారించాం. ఖాళీ స్థలాలను లీజు పద్ధతిన కేటాయించడంతోపాటు, అవసరమైన చోట షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం. దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. వాటిని కూడా పూర్తిస్థాయిలో వసూలు చేసి, బకాయిలు చెల్లింపునకు చర్యలు చేపడతాం. ప్రభుత్వ భవనాల పన్నులు కూడా ఎక్కువ మొత్తంలో పెండింగ్ ఉంది. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నాం.
డాక్టర్ కె.వెంకటేశ్వరరావు,నగర కమిషనర్