Share News

పోలీసు శాఖలో విషాదం

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:42 AM

పోలీసు శాఖలో ఒకే రోజు ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందారు. వారిలో ఇరువురు హెడ్‌ కానిస్టేబుళ్లు హఠాన్మరణం చెందగా.. మరో కానిస్టేబుల్‌ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆశాఖలో విషాదం నెలకొంది.

పోలీసు శాఖలో విషాదం

ఇరువురు హెడ్‌ కానిస్టేబుళ్లు హఠాన్మరణం

మరొకరు ఆత్మహత్య

మంత్రి లోకేష్‌ దిగ్ర్భాంతి

ఒంగోలు క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పోలీసు శాఖలో ఒకే రోజు ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందారు. వారిలో ఇరువురు హెడ్‌ కానిస్టేబుళ్లు హఠాన్మరణం చెందగా.. మరో కానిస్టేబుల్‌ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆశాఖలో విషాదం నెలకొంది. ఒంగోలు దిశ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ చలపతిరావు ఈనెల 6న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా శనివారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. తిరిగి వెనక్కి తీసుకొస్తుండగా మృతిచెందారు. ఒంగోలులో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కోమటినేని విజయకృష్ణ (46) స్థానిక మార్కెట్‌ యార్డులో విధులు ముగించుకొని శనివారం ఉదయం కమ్మపాలెంలో ఇంటికి వచ్చి టిఫిన్‌ చేస్తూ వాంతులు చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.. మార్కాపురం మండలం కొట్టాలపల్లెకు చెందిన కానిస్టేబుల్‌ వేముల మస్తాన్‌(32) మార్కాపురం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నారు. కుటుంబ కలహల నేపఽథ్యంలో ఇంట్లో ఉరి వేసుకొని మృతిచెందారు.

మంత్రి లోకేష్‌ దిగ్ర్భాంతి

హెడ్‌ కానిస్టేబుల్‌ విజయకృష్ణ హఠాన్మరణం విషయం తెలిసి మంత్రి నారా లోకేష్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గత పభుత్వంలో చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో తీవ్ర పదజాలంతో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన సమయంలో మనస్తాపానికి గురై విజయకృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తిరిగి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆయన మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుతం వీఆర్‌లో పనిచేస్తున్న విజయకృష్ణ గుండెపోటుతో మృతిచెందడంతో మంత్రి లోకేష్‌ ఎక్స్‌లో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అదేవిధంగా హెడ్‌కానిస్టేబుల్‌ విజయకృష్ణ మృతి చాలా బాధాకరమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వైసీపీ అరాచకాలను నిలదీసినందుకు విజయకృష్ణను గతంలో అనేక రకాలుగా వేధించారని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ విజయకృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముక్తినూతలపాడులోని ఆయన గృహానికి మృతదేహాన్ని తరలించగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌, టీడీపీ నాయకుడు కామేపల్లి శ్రీనివాసరావు సందర్శించి నివాళులర్పించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ అజయ్‌కుమార్‌ కూడా మృతదేహంపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

Updated Date - Nov 12 , 2024 | 01:42 AM