రైళ్లంటేనే కోపం.. అందుకే దాడి
ABN , Publish Date - Nov 03 , 2024 | 01:20 AM
వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన యువకుడిని ఒంగోలు ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను చెప్పిన విషయం విని వారు అవాక్కయ్యారు. తన సోదరులు రైళ్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో తనకు రైళ్లంటేనే కోపమని.. అందువల్లే దాడిచేశానని తెలపడం కొసమెరుపు.
వందేభారత్‌పై రాళ్లు రువ్విన యువకుడు అరెస్టు
ఒంగోలుక్రైం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన యువకుడిని ఒంగోలు ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను చెప్పిన విషయం విని వారు అవాక్కయ్యారు. తన సోదరులు రైళ్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో తనకు రైళ్లంటేనే కోపమని.. అందువల్లే దాడిచేశానని తెలపడం కొసమెరుపు. ఒంగోలు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ హీరాసింగ్ శనివారం వివరాలను వెల్లడిం చారు. ఆయన కథనం మేరకు.. గతనెల 19న తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై ఒంగోలు సూరారెడ్డిపాలెం మధ్యలో ఎవరో రాళ్లు వేశారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీ2 బోగీ అద్దం పగిలింది. ప్రయాణికులెవ్వరికీ గాయాలు కాలేదు. దీంతో కేసు నమోదు చేసి విచారించిన అనంతరం రాళ్ల దాడి చేసింది ఒంగోలులోని ప్రగతినగర్‌కు చెందిన చప్పిడి ప్రవీణ్‌కుమార్‌గా గుర్తించామని సీఐ పేర్కొన్నారు. అతను గొర్రెలు కాచుకుంటూ వందేభారత్‌పై రాళ్లు విసరడం సీసీ ఫుటేజీలో కనిపించిందని తెలిపారు. దీంతో ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేశామన్నారు.
రైళ్లంటే ద్వేషం పెంచుకుని..
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వడానికి కారణం ఏమిటి అని విచారించిన పోలీసులకు నిందితుడు ప్రవీణ్‌కుమార్ ఆసక్తికరమైన విషయం తెలిపాడు. తనకు ఇద్దరు సోదరులు ఉన్నారని వారిరువురూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రేమ విఫలమైందని ఏడాది క్రితం ఒకరు, భార్య కాపురానికి రాలేదని మరొకరు వేర్వేరుగా రైలు కిందపడి మృతిచెందడంతో తనకు రైళ్లను చూస్తేనే కోపం అని తెలిపాడు.