Share News

పోలీసు శాఖలో బదిలీలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:22 AM

పోలీసు శాఖలో కీలకమైన కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈనెల 5న కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానచలనం కల్పించనున్నారు. ఈమేరకు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆదేశాలు ఇచ్చారు.

పోలీసు శాఖలో బదిలీలు

కానిస్టేబుళ్లు, హెచ్‌సీలు, ఏఎస్‌ఐలకు అవకాశం

ఐదేళ్లు నిండిన వారికి స్థానచలనం

5న కౌన్సెలింగ్‌

ఒంగోలు క్రైం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో కీలకమైన కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈనెల 5న కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానచలనం కల్పించనున్నారు. ఈమేరకు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆదేశాలు ఇచ్చారు. కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలను మార్చనున్నారు. ఐదేళ్లపాటు ఒకేచోట పనిచేసిన వారిని కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా బదిలీ చేయను న్నారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఉండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు బదిలీలు అయితే ఆయా ప్రాంతాలకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఐదేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్న వారు 230 మంది, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న వారు 35మందితో కలిపి 265 మంది బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరు కానున్నారు.

నిబంధనలు ఇలా..

పోలీసు శాఖలో ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం తప్పదు.

సర్కిల్‌ ప్రాతిపదికగా బదిలీలు చేస్తారు

సొంత గ్రామం ఉన్న సర్కిల్‌కు అవకాశం లేదు.

ఒంగోలులో ఉన్న మూడు పోలీసు స్టేషన్‌లను కలిపి ఒక సర్కిల్‌గా పరిగణిస్తారు

ప్రస్తుతం ఒంగోలులో ఉన్న మూడు స్టేషన్లలో పనిచేస్తున్నవారు ట్రాఫిక్‌, సీసీఎస్‌, దిశ పోలీసు స్టేషన్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిల్‌ నుంచి మరో సర్కిల్‌కు బదిలీ చేస్తారు.

కౌన్సెలింగ్‌లో వారు కోరుకున్న ప్రాంతాల్లో ఖాళీ ఉంటేనే బదిలీ చేసే అవకాశం ఉంది.

Updated Date - Nov 03 , 2024 | 01:22 AM