Share News

ముందుకుసాగని ‘మొగిలిగుండాల’

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:42 PM

దశాబ్దాలకాలంగా నిర్మించతలపెట్టిన శ్రీబూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తయి రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ముందుకుసాగని ‘మొగిలిగుండాల’
చదునుచేసిన మొగిలిగుండాల చెరువు కట్ట

చెరువు కట్టను పూర్తిగా తొలగించి పనులు నిలుపుదల

గత ప్రభుత్వంలో బిల్లులు రాక చేతులెత్తేసిన కంటాక్టర్‌

కూటమి ప్రభుత్వంలో రూ.కోటి 20లక్షలు విడుదల

పనులు ప్రారంభించి రిజర్వాయర్‌ నిర్మాణం

వేగవంతం చేయించాలని రైతుల వినతి

తాళ్లూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలకాలంగా నిర్మించతలపెట్టిన శ్రీబూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తయి రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్‌ బిల్లులు చెల్లించక పోవటంతో అర్ధంతరంగా పనులు నిలిపివేశారు. గత మూడేళ్లుగా రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ముందుకుసాగక నిర్మాణపనులు నిలిచి పోయాయి.

తాళ్లూరు పరిసర ప్రాంత 20గ్రామాలకు చెందిన ప్రజల సాగునీరు, త్రాగునీటి కోసం దాదాపు 50ఏళ్లుగా మొగిలిగుండాల రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. తాళ్లూరు పరిసరప్రాంతాలకు చెందిన రైతాంగం కోసం శివరాంపురం సమీపాన గల మొగిలిగుండాల చెరువును మినీరిజర్వాయర్‌ నిర్మాణానికి, భూసేకరణకు టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు రూ.10కోట్ల 40లక్షలు నిధులు మంజూరు చేయించారు. 2019 మార్చి మాసంలో భూమి పూజ చేశారు. అయితే, ఆతర్వాత ఎన్నికలు రావటంతో పనులు ప్రారంభించలేదు. తదుపరి వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రావటం, రిజర్వాయర్‌ నిర్మాణపనులు చేపట్టకపోవటంతో రీటెండరింగ్‌ విధానం పేరిట ఆపనిని రద్దు చేశారు. అప్పటి ఎమ్మెల్ల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రద్దయిన మినీరిజర్వాయర్‌ నిర్మాణం నిధులను రీటెండర్‌ కింద మరలా రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.7కోట్ల 97లక్షలు, భూసేకరణకు రూ.2కోట్ల43 లక్షలు కలిపి మొత్తం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.10కోట్ల 40లక్షల మంజూరు చేయించారు. సెప్టెంబరు 2, 2021న భూమిపూజ చేశారు.

పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ మూడు నెలల పాటు వేగవంతంగా చెరువు కట్ట మొత్తంను చదునుచేశారు. దాదాపు 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో రెండుపర్లాంగుల పొడవున చెరువుకట్ట మట్టిని తొలగించి చదును చేశారు. అయితే, చేసిన పనులకు బిల్లులు చెల్లింపులకోసం నెలల తరబడి ఎదురు చూసి మంజూరు కాకపోవటంతో నిర్మాణ పనులు నిలుపి వేశాడు. బిల్లులు జవ కాకపోవటంతో యంత్రసామగ్రిని కూడా అక్కడ నుంచి తీసుకెళ్లాడు. దీంతో మూడేళ్లకు పైగా రిజర్వాయర్‌ నిర్మాణపనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పనులు చేపట్టగానే భూనిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్న అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. కొంతకాలం ఎదురు చూసిన భూనిర్వాసిత రైతాంగం రిజర్వాయర్‌ నిర్మాణం కోసం కేటాయించిన భూముల్లో సాగు చేపట్టారు. ఇటీవల వర్షాలు అధికంగా కురిసినా చెరువు కట్టలేక పోవటంతో చుక్కనీరు నిల్వ లేదు. చెరువు కట్టను చదును చేయటం వల్ల నీరు నిల్వలేక బోరుబావుల్లో నీరు తగ్గుతూ రైతాంగం ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొగలిగుండాల రిజర్వాయర్‌ను పూర్తిచేసి తాళ్లూరు ప్రాంత ప్రజల కలలు సాకారం నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్‌ చేసిన పనులకు రూ.1కోటి 20లక్షల నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినందున ఆశాఖ అధికారులు కాంట్రాక్టర్‌ను సంప్రదించి రిజర్వాయర్‌ పనులు తిరిగి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:42 PM