వాహనాల ఫిట్‌నెస్.. ఇక ప్రైవేట్!
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:24 AM
సరుకులు రవాణా చేసే వాహనాల ఫిట్‌నెస్ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అధికారులు ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించారు.
గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో కేంద్రం
రవాణా శాఖలో కీలక మార్పులు
సాంకేతికతతో నిర్ధారణ
ఒంగోలు క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సరుకులు రవాణా చేసే వాహనాల ఫిట్‌నెస్ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అధికారులు ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించారు. జిల్లాలోని గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో ప్రైవేటు వారు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడ పూర్తి సాంకేతిక పద్ధతులలో వాహనాల ఫిట్‌నెస్ చూడనున్నారు. ఇక నుంచి వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో అనంత పురం, నంద్యాలలో ఇలాంటి ఫిట్‌నెస్ సెంటర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వాహనాలకు ఎలాంటి మరమ్మతులు ఉన్నా సాంకేతిక పద్ధతిలో గుర్తించి ఫిట్‌నెస్ ఉంటేనే సర్టిఫికెట్లు ఇస్తారు. ఎలాంటి చిన్న లోపాలు ఉన్నా అనుమతి లభించదు.
ఏడాదికి ఒకసారి తప్పనిసరి
జిల్లాలో వివిధ రకాల వాహనాలు సుమారు 30వేలు ఉన్నాయి. వీటికి బ్రేక్, ఫిట్‌నెస్ విషయాలను ప్రైవేటు ఏజెన్సీలు చూస్తాయి. సరుకు రవాణా చేసే ఆటోలు, లారీలు, కమర్షియల్ ట్రాక్టర్లు, పాఠశాల బస్సులు, ప్రైవేటు బస్సులు తదితర వాహనాలు అన్నీ ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్ చేయించుకుని సర్టిఫికెట్లు పొందాల్సి ఉంది. అయితే ఈ ప్రైవేటు ఏజెన్సీలపై పర్యవేక్షణ రవాణా శాఖకు ఉండాలని సంబంధిత అధికారులు తమ యూనియన్ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక పద్ధతుల ద్వారా ఫిట్‌నెస్‌లు సక్రమంగా జరగవు అనే వాదన వారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీల ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోంది.
సాంకేతిక పద్ధతుల ద్యారా ఫిట్‌నెస్
ఫిట్‌నెస్ చేయాల్సిన వాహనాలను ప్రైవేటు ఏజెన్సీలు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏర్పాటు చేసిన స్కానర్ల మధ్య ఉంచుతారు. పూర్తిగా స్కాన్ చేసిన తరువాత వాహనానికి ఎక్కడ సమస్యలు ఉన్నా కంప్యూటర్‌లో తెలిసిపోతుంది. వాటికి మరమ్మతులు చేయించుకుంటేనే వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికెటు వస్తుంది. అయితే ప్రైవేటు ఏజెన్సీలు ఫిట్‌నెస్ చేయడంలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని రవాణాశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఉన్న రవాణా వాహనాలు
జిల్లాలో రవాణా వాహనాలు సుమారు రూ.30 వేలు ఉన్నాయి. ఒంగోలు రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయం పరిధిలో 24,776 ఉండగా మార్కాపురంలో 5,225, దర్శి రవాణా శాఖ కార్యాలయం పరిధిలో 45 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఆటోల సంఖ్య 10వేలకుపైగా ఉంది. సరుకు రవాణా చేసే ఆటోలు 2,700, కమర్షల్ ట్రాక్టర్లు 3,700, లారీలు 8,500, స్కూలు బస్సులు 600, ప్రైవేటు బస్సులు 500 ఉన్నాయి. ఇంకా అంబులెన్స్‌లు, మోటర్‌క్యాబ్‌లు 1100, అంబులెన్స్‌లు 100, ట్రాక్టర్ ట్రాలీలు 1,500 మిగిలినవి ఇతర వాహనాలు తిరుగుతున్నాయి.