నామినేటెడ్ కోసం నిరీక్షణ
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:45 PM
రాష్ట్ర స్థాయి లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైన నేపథ్యంలో స్థానికంగా నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జన సేన, బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరశింహస్వామి దేవాలయాలతో పాటు పలు దేవాలయాల ట్రస్ట్‌బోర్డులు, అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీల చైర్మన్‌లు, సభ్యులతోపాటు పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
ప్రయత్నాలు ముమ్మరం చేసిన కూటమి నేతలు
దేవాలయాల ట్రస్ట్ బోర్డులు,
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు పోటీ
మంత్రి గొట్టిపాటి వద్దకు క్యూ
అందరి నిర్ణయంతో కేటాయిస్తామన్న రవికుమార్
అద్దంకి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర స్థాయి లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైన నేపథ్యంలో స్థానికంగా నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జన సేన, బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరశింహస్వామి దేవాలయాలతో పాటు పలు దేవాలయాల ట్రస్ట్‌బోర్డులు, అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీల చైర్మన్‌లు, సభ్యులతోపాటు పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అదే సమయంలో సొసై టీల ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో నామినేటెడ్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆయా మండలాలలో యాక్టివ్‌గా పనిచేసిన నేతలు పదవులపై ఆశగా ఉన్నారు. టీడీపీ నేతలతో పాటు జన సేన, బీజేపీ నేతలు కూడా డైరెక్టర్ పోస్టులకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా దశాబ్దాల కాలం గా అద్దంకి పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గ నేతలకే కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి పట్టణంలోని పలువురు ఆర్యవైశ్య నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు తమ ప్రయత్నాలలో భాగంగా మంత్రి రవికుమార్‌ను మందీమార్బలంతో వెళ్లి కలవగా బల ప్రదర్శన చేయవద్దని సున్నితంగా నేతలకు చెప్పినట్లు సమాచారం. అవసరమైతే అందరు ఆర్యవైశ్య నేతలతో మాట్లాడి నిర్ణయిస్తానని బల ప్రదర్శనలు చేస్తే మిగిలిన వారు కూడా అదే బాట లో నడుస్తారని చెప్పినట్లు తెలుస్తుంది. శింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా గతంలో అగ్ర వర్ణాల నేతలు పనిచేయగా, వైసీపీ ప్రభుత్వం బీసీ, కాపులకు అవకాశం కల్పించింది. ఇక మార్కెట్ కమిటీ విషయానికొస్తే రిజర్వేషన్‌ల విష యం చర్చనీయాంశంగా మారింది. గతంలో మార్కెట్ కమిటీలకు ఎలాంటి రిజర్వేషన్‌లు లేకపోగా వైసీపీ పాలనలో రిజర్వేషన్‌లు కల్పించారు. దీంతో అద్దంకి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తొలి విడత బీసీలకు, సంతమాగులూరు మార్కెట్ కమిటీ ఎస్సీలకు అవకాశం కల్పించారు. రెండవ దఫా అద్దంకి ఎస్సీలకు, సంతమాగులూరు బీసీలకు కేటాయించారు. దీంతో వైస్ చైర్మన్ లుగా అగ్రవర్ణాల వారికి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ విధంగా ఉంటుందో అన్న చర్చ కూడా సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెల లు కావడంతో పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే తమ ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. నామినేటెడ్ పదవులను సామాజిక వర్గాల సమతూకం పాటించాల్సి ఉండడంతో ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ ప్రయత్నాలు ప్రారంభించారు.