Share News

కంభం మార్కెట్‌యార్డు తలరాత మారేనా ?

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:42 AM

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అక్కరకు రాకుండా పోతోంది.

కంభం మార్కెట్‌యార్డు తలరాత మారేనా ?

కంభం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అక్కరకు రాకుండా పోతోంది. గత ప్రభుత్వం, అధికారులు రైతుల్లో అవగాహన కల్పించక పోవడం, గోదాములు ఉన్నా వినియోగించుకోక పోవడంతో పథ కం మూలకు చేరింది. కంభం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో గోదాములు ఉన్నా ప్రయోజనం శూన్యం. వీటి లో రైతులెవరూ పంట దిగుబడులను దిగుమతి చేసుకో వడం లేదు. కావున ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజ నాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మార్కెట్‌యార్డులపై దృష్టిసారించింది. నిరుపయోగంగా ఉన్న మార్కెట్‌యార్డులను గుర్తించి అవి రైతులకు ఉపయోగపడేలా చేస్తామని చెబుతోంది. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కంభం వ్యవసాయ మార్కెట్‌ యార్డు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ ప్రాంత రైతులు నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కంభం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాలు ఉన్నాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో రైతులు పంటలను నిలువ చేసుకునేందుకు కంభంలో రూ.40 లక్షలతో రెండు గోదాములు నిర్మించారు. ఏటా రైతులు తమ ఉత్పత్తులను ఈ గోడౌన్లలో నిల్వ చేసుకోవచ్చు. అయితే వీటి గురించి అధికారులు గాని, గత వైసీపీ ప్రభుత్వం పట్టించు కోలేదు. దాంతో సివిల్‌ సప్లై వారు లీజ్‌కు తీసుకుని రేషన్‌ సరుకులు నిలువ చేసుకుంటున్నారు.

ఇవి ఉపయోగాలు

గోదాములలో నిలువ ఉంచి పంట విలువలో 75 శాతం రైతుబంధు పథకం ద్వారా రుణం తీసుకోవచ్చు. అలాగే గరిష్ఠంగా 50వేల వరకు రుణం పొందే అవకాశం ఉంది. మొదటి 3 నెలల కాలానికి వడ్డీ వర్తించదు. ఆ తరువాత 5వేలకు 5శాతం, 10వేలకు 6శాతం, 15వేలకు 8శాతం, 50వేలు లోపు అయితే 10శాతం వంతున వడ్డీలు చెల్లించాలి. కానీ కంభం ఏఎంసీ పరిధిలో ఈ పథకం అసలు అమలులో లేదు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది.

కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మిస్తే రైతుల కష్టాలు తీరుతాయి

కంభంలో కోల్డ్‌స్టోరేజ్‌ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వా నికి వినతిపత్రాలు అందచేశారు. ఈ ప్రాంత తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన శనగ, మిరప, కంది, పెసర పంటలు పండించుకోవలసి వస్తున్నదని, వాటి గిట్టుబాటు లేని సమయంలో దిగుబడులు నిలువ చేసుకునేందుకు వీలుగా కంభం మార్కెట్‌యార్డులో కోల్డ్‌స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:42 AM