Share News

ప్రక్షాళన జరిగేనా?

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:25 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా వైద్యశాఖ ప్రతిష్ట మసకబారింది. అనేక అక్రమాలకు నిలయంగా మారింది. అసలు ఆ శాఖ అంటేనే జనం హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏపని కావాలన్నా చేతులు తడపాల్సిన పరిస్థితి కొనసాగింది.

ప్రక్షాళన జరిగేనా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్యశాఖలో అన్నీ అడ్డగోలు వ్యవహారాలు

ఉద్యోగుల నియామకాల నుంచి బదిలీల వరకు అక్రమాలే

అంతటా దళారులదే ఇష్టారాజ్యం

అక్రమ డిప్యుటేషన్లు, వైద్యశాలల తనిఖీల పేరుతో అధికారుల వసూళ్ల పర్వం

నేడు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా వైద్యశాఖ ప్రతిష్ట మసకబారింది. అనేక అక్రమాలకు నిలయంగా మారింది. అసలు ఆ శాఖ అంటేనే జనం హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏపని కావాలన్నా చేతులు తడపాల్సిన పరిస్థితి కొనసాగింది. ఇక ఉద్యోగ నియామకాలు అంటే అధికారులు, సిబ్బందికి పండుగే. ఏ ఉద్యోగం ఎవరికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. అర్హులను కాదని పోస్టులను అనర్హులకు కట్టబెట్టిన ఘటనలు కోకొల్లలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్లలో వైద్యశాఖలో చోటుచేసుకున్న అవకతవకలు అన్నీఇన్నీ కావు. కరోనా విపత్కర సమయంలో చేపట్టిన పలురకాల నియామకాల్లోనూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆ వ్యవహారంపై ఏకంగా త్రిసభ్య కమిటీని విచారణకు నియమించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగ నియా మకాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆ కమిటీ విచారణ నివేదికలు ఇచ్చినా పట్టించుకునే వారు కరువయారు.

బదిలీలలో భారీగా అవకతవకలు

ఉద్యోగుల బదిలీల సమయంలో చేతులు తడిపిన వారిని అనుకూలమైన ప్రాంతాలకు, అర్హత ఉన్న వారిని సుదూర ప్రాంతాలకు స్థానచలనం కల్పించిన ఉదంతాలు ఉన్నాయి. ఇక ఉద్యోగుల అక్రమ డిప్యుటేషన్లు సరేసరి. ఏ ఉద్యోగిని ఎక్కడి నుంచి ఎక్కడకు పంపుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ అక్రమ డిప్యుటేషన్లలో భారీగా చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చినా పట్టించుకున్న వారు లేరు. ఇవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రైవేటు వైద్యశాలల అనుమతుల విషయంలోనూ అడ్డగోలు వ్యవహారాలు నడిచాయి. ఒక డాక్టర్‌ అందుకోసం తన వైద్య వృత్తినే పక్కన పెట్టి కార్యాలయంలో తిష్టవేసి వ్యవహారాలు నడిపిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. మరోవైపు వైద్యశాఖ కార్యాలయంలోనే కొంతమంది ఉద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకొని డబ్బులు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.


పాలన కత్తి మీద సామే

గత ఐదేళ్లలో వైద్యశాఖ అనేక అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాకు వైద్యారోగ్యశాఖ అధికారిగా నియమితులైన డాక్టర్‌ వెంకటేశ్వర్లుకు పరిపాలన కత్తి మీద సాములా తయారైంది. పోయిన పరువును నిలబెట్టాలంటే ప్రక్షాళన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి జిల్లాలోని అద్దంకిలో పనిచేసిన వెంకటేశ్వర్లుకు అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఆ కారణంగానే ఆయనను జిల్లా వైద్యశాఖాధికారిగా నియమించారు. వెంకటేశ్వర్లు బుధవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన కార్యాలయంలో జరుగుతున్న అనేక అంశాలపై ఇప్పటికే సమాచారం తెప్పించుకొని ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. వైద్యశాఖ కార్యాలయ పరిస్థితితోపాటు అందులో పనిచేసే ఉద్యోగుల వ్యవహారాలు కూడా ఆయన దృష్టిలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ పరువు, ప్రతిష్టలను ఇనుమడింపజేసే దిశగా నూతన డీఎంహెచ్‌వో అడుగులు వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Dec 25 , 2024 | 01:25 AM