బంధువుల ఇంట్లో చోరీ కేసులో మహిళ అరెస్టు
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:48 PM
బంధువుల ఇంట్లో ఉన్న నగలపై మోజుపడిన ఓ మహిళ వాటిని చోరీ చేసి జైలు పాలైయింది. ఈ సంఘటన గత నెల 4న కనిగిరిలో జరిగింది. పోలీసులు ఆ కేసులో నిందితురాలిని మంగళవారం అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రూ.12.50లక్షలు సొత్తు రికవరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ
ఒంగోలు క్రైం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి) : బంధువుల ఇంట్లో ఉన్న నగలపై మోజుపడిన ఓ మహిళ వాటిని చోరీ చేసి జైలు పాలైయింది. ఈ సంఘటన గత నెల 4న కనిగిరిలో జరిగింది. పోలీసులు ఆ కేసులో నిందితురాలిని మంగళవారం అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో గెలాక్సీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆ కేసు వివరాలను వెల్లడించారు. కనిగిరిలోని పాతకూచంపూడిపల్లికి చెందిన వేముల అఖిల ప్రస్తుతం పామురులో నివాసం ఉంటుంది. ఆమెకు పాతకూచిపూడిపల్లికి చెందిన బత్తుల వెంకటరమణ బంధువు. నిత్యం వెంకటరమణ ఇంటికి అఖిల వచ్చి వెళుతుంటుంది. దీంతో వెంకటరమణ వద్ద ఉన్న బంగారు నగలను చూసి ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ వేసింది. గత నెల 4న వెంకట రమణ ఇంట్లో లేని విషయం అఖిల తెలుసుకుంది. తాళాలు మెట్ల కింద ఉండగా తీసుకొని లోపలకు ప్రవేశించి బీరువా తెరిచి నగలు అపహరించుకెళ్లింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కనిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం నిందితురాలు అఖిల దొంగిలించిన బంగారాన్ని అమ్ముకునేందుకు ఒంగోలు వెళుతుండగా సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్‌లు తన సిబ్బందితో వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతోపాటు 25 సవర్ల బంగారు ఆభరణాలను రికవరీ చేశారని ఎస్పీ తెలిపారు.
అభినందనలు
దొంగతనం కేసును ఛేదించడంలో సీఐ ఎస్.కె.ఖాజావలి, ఎస్సైలు శ్రీరామ్, మాధవరావు, హెడ్‌కానిస్టేబుల్ శోభన్‌బాబు, కానిస్టేబుళ్లు బాలగురవయ్య, కాశీరామ్, హోంగార్డు ఎస్.రమణయ్యలను ఎస్పీ అభినందిచారు.