ప్రజలందరూ మెచ్చేలా పనిచేయాలి
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:00 AM
సచివాలయ సెక్రటరీలు ప్రజలు మెచ్చేలా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సచివాలయ సెక్రటరీలు, కార్పొరేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది.
అభివృద్ధి, సంక్షేమంలో సెక్రటరీలదే కీలక పాత్ర
ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్
సచివాలయ సెక్రటరీలు, కార్పొరేషన్ సిబ్బందితో సమావేశం
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సెక్రటరీలు ప్రజలు మెచ్చేలా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సచివాలయ సెక్రటరీలు, కార్పొరేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు ప్రసంగించారు.
గతంలో లాగ పనిచేస్తే కుదరదు : దామచర్ల
సచివాలయాల్లో సేవలపై ప్రజలు మెచ్చుకునేలా ఉండాలని, గతంలోలాగ పనిచేస్తే కుదరదని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. ఇక నుంచి అనిన విభాగాల సెక్రటరీలు తమ సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆ వివరాలను నమోదు చేసి కమిషనర్‌కు నివేదిక అందించాలని తెలిపారు. ఇకపై ప్రతి పది సచివాలయాలపై ఒక సూపర్‌వైజర్‌ను నియమించి పనితీరును పరిశీలిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతి లేని పాలన అందించే దిశగా సాగుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని సూచించారు. రేషన్‌కార్డులు, ఇంటి స్థలాలు, పింఛన్లు, ఇతరత్రా సమస్యల అర్జీలను స్వీకరించి సకాలంలో ఆన్‌లైన్ చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని తెలిపారు. అలాగే కార్పొరేషన్‌లో ప్రక్షాళన మొదలైందని, ఇందుకోసం కార్పొరేషన్ కమిషనర్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్‌లో సమర్ధవంతమైన అధికారులు వచ్చారన్నారు. వారి సూచనలు, ఆదేశాల మేరకు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. సెక్రటరీలకు సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని దామచర్ల హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
జవాబుదారీతనంగా ఉండాలి : బీఎన్
సచివాలయాల ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఎమ్మెల్యే బీఎన్ పేర్కొన్నారు. వచ్చామా.. వెళ్లామా.. విధంగా కాకుండా మంచి సేవలు అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, పౌరసేవలు సక్రమంగా అమలు జరిగినపుడు అన్నీ సాధ్యపడతాయని చెప్పారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇకపై సచివాలయాల్లో సేవలపై సమీక్షలు, తనిఖీలు ఉంటాయని, విధులకు గైర్హాజరు కాకుండా, మూమెంట్ రిజిస్టరు పాటించాలన్నారు. డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కూటమి కార్పొరేటర్లతోపాటు, ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు, నగరంలోని అన్ని సచివాలయ సెక్రటరీలు, సెక్షన్ హెడ్‌లు పాల్గొన్నారు.