Share News

పురుగులు.. తెగుళ్లు..

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:12 AM

జిల్లావ్యాప్తంగా పైర్లను ప్రస్తుత వాతావరణం తీవ్రంగా దెబ్బతీస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావం జిల్లాపై పెద్దగా లేదని ఊపిరిపీల్చుకున్న రైతులకు మరో విధంగా దెబ్బతగిలింది. తుఫాన్‌ ప్రభావంతో వారం రోజులుగా నెలకొన్న మంగు వాతావరణం పంటలను తీవ్రంగా నష్టపరుస్తోంది.

పురుగులు.. తెగుళ్లు..
తర్లుపాడు వద్ద తెగులు ఆశించిన కంది పైరు

నివారణకు రూ.100 కోట్ల వరకూ వ్యయం

అయినా అదుపులోకి రాని పరిస్థితి

తాజా వాతావరణంతో మరింత ఉధృతి

పంటలను పీల్చిపిప్పి చేస్తున్న చీడపీడలు

దిగుబడులపైనా తీవ్ర ప్రభావం

నష్టపోతామని రైతుల ఆందోళన

మంగు వాతావరణం కొనసాగితే భారీ నష్టం

జిల్లాలో పంటలపై తెగుళ్లు, పురుగులు విజృంభిస్తున్నాయి. రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఐదు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పైర్లపై వివిధ రకాల తెగుళ్ల దాడి తీవ్రమైంది. ముఖ్యంగా మిరపకు కుచ్చు ముడత సోకింది. ఖరీఫ్‌లో సాగు చేసిన శనగలో పచ్చపురుగు ఉధృతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పూతదశలో ఉన్న కందికి పచ్చ పురుగు, ఎండు తెగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండటం లేదు. రెండేళ్ల నుంచి మిర్చి వేసిన రైతులు నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొంతమంది రైతులు కాయలు కోసేస్తున్నారు. మిగతా పంటల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

ఒంగోలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పైర్లను ప్రస్తుత వాతావరణం తీవ్రంగా దెబ్బతీస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావం జిల్లాపై పెద్దగా లేదని ఊపిరిపీల్చుకున్న రైతులకు మరో విధంగా దెబ్బతగిలింది. తుఫాన్‌ ప్రభావంతో వారం రోజులుగా నెలకొన్న మంగు వాతావరణం పంటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఎదుగుదల, పూత, పిందె దశలో ఉన్న పలు పైర్లపై ప్రస్తుతం తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగింది. వీటి ప్రభావం ప్రధాన పంటలు, ప్రత్యేకించి ఖరీఫ్‌లో సాగై ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న కంది, మిర్చి, మినుము, వరి, పొగాకు తదితర వాటిపై అధికంగా కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే పంటలు దెబ్బతిని దిగుబడులు సగానికి సంగం పడిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో సాగైన ప్రధాన పంటలు దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో ఉన్నాయి. వాటిలో కంది, మిర్చి, వరి, పొగాకు, మినుము, అలసంద, పత్తి వంటివి ప్రధానమైనవి. వాటిపై తెగుళ్లు, పురుగుల ఉధృతి అధికంగా ఉంది. రెండొంతుల విస్తీర్ణంలో తెగుళ్లు తీవ్రత ఉండగా నివారణ కోసం రైతులు దాదాపు ఎకరాకు కనీసం రూ.3వేల నుంచి 5వేల వంతున వేసినా ఇంచుమించు రూ.100కోట్ల మేర సస్యరక్షణ మందుల కోసం ఖర్చుచేశారు. అయినా తెగుళ్లు అదుపులోకి రావడంలేదని వాపోతున్నారు. సాధారణంగా ఈ సమయంలో పొలంలో ఉన్న పంటలపై తెగుళ్లు సోకుతుంటాయి. నివారణకు రైతులు మందులు పిచికారీ చేసి వాటిని అదుపు చేస్తారు. కానీ ప్రస్తుతం జిల్లాలో వారం రోజులుగా నెలకొన్న వాతావరణం చీడపీడల ఉధృతికి దోహదం చేస్తుండటంతో మందులు వాడినా అవి అదుపులోకి కావడం లేదని రైతులు చెబుతున్నారు.

పంటల కీలక దశలో తెగుళ్లు

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 4.01 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో ప్రధానంగా లక్షా 75వేల ఎకరాల్లో కంది, 56వేల ఎకరాల్లో మిర్చి, 30వేల ఎకరాల్లో పత్తి, 24వేల ఎక రాల్లో వరి, 16వేల ఎకరాల్లో సజ్జ, 8వేల ఎకరాల్లో నువ్వు వంటివి ఉన్నాయి. వాటిలో సజ్జ, నువ్వు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో ఎదుగుదల దశలో కొన్ని.. పూత, పిందె, కాయ దశల్లో మరికొన్ని ఉన్నాయి. అలాగే రబీ పంటలు ఇప్పటివరకు సుమా రు లక్షా 40వేల ఎకరాల్లో సాగు చేశారు. అందులో 50 వేల ఎకరాల్లో పొగాకు, 25వేల ఎకరాల్లో మినుము, మరో 25వేల ఎకరాల్లో శనగ, 15 వేల ఎకరాల్లో వరి, 8వేల ఎకరా ల్లో మిర్చి, 8వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15 వేల ఎకరాల్లో అలసంద ఉంది. ఈ పైర్లలో అధిక భాగం ఎదుగుదల దశలో, మరికొన్ని మొలక దశలో ఉన్నాయి. అలా అటు ఖరీఫ్‌, ఇటు రబీ పైర్లన్నింటికీ ప్రస్తుత సమయం చాలా కీలకమైనది. ఈ దశలో తెగుళ్లు విజృంభించాయి.


భిన్న వాతావరణం

సాధారణంగా ఈ సమయంలో వర్షాలు తిరిగి పగటిపూట ఒక మోస్తరు ఎండలు, రాత్రిపూట కొంతమేర చలి, తెల్లవారుజామున మంచు ఉంటుంది. దీంతో పురుగు, తెగుళ్లు ఆశించినా పగటి పూట ఎండలతో బయటకు వచ్చి రైతులు పిచికారి చేసే సస్యరక్షణ మందులు పనిచేయడంతో చచ్చిపోతాయి. కొన్నిరకాల తెగుళ్లు చలి, మంచుతో పోతాయి. అయితే ప్రస్తుతం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. పదిరోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి పగటి పూట ఎండ కనిపించకపోవడమే కాక నిత్యం జల్లులు పడుతున్నాయి. రాత్రిపూట సాధారణంగా ఉండే చలి, మంచు అంతగా కనిపించలేదు. దీంతో జిల్లాలో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల పంటలపైన తెగుళ్లు, పురుగుల దాడి పెరిగింది. ఏపుగా పెరుగుతున్న మిర్చి, కంది పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మిర్చిపై జిల్లా అంతటా కుచ్చుతెగులు సోకింది. దీని వల్ల ఆకులు ముడతలు పడి వంకర్లు తిరిగి పోవడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయి ఎండిపోతున్నాయి. తామర పురుగు, రసం పీల్చే తెల్లపురుగు, నల్ల వైరస్‌ ప్రభావం కూడా కనిపిస్తోంది. పశ్చిమప్రాంతంలోని దోర్నాల, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, వైపాలెం తదితర మండలాల్లో వేసిన ఖరీఫ్‌ మిర్చిలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. మందులు పిచికారీ చేసినా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది.

భయపెడుతున్న పచ్చపురుగు

కనిగిరి, పొదిలి, మార్కాపురం, దర్శి తదితర సబ్‌డివిజన్ల పరిఽధిలో సాగు చేసిన కంది పైరు ప్రస్తుతం బాగా ఎదిగి పూత, పిందె దశకు చేరుకొంది. ఈ దశలో ఆకుముడత, ఎండు తెగులు, మచ్చల పురుగు సోకి వాటి ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. ఇక పొగాకులో జిల్లా అంతటా లద్దెపురుగు ప్రభావం అధికంగా ఉంది. వరిలో పడిదోమ ఉధృతంగా కనిపిస్తోంది. పత్తి పంటను రసం పీల్చే పురుగులు తీవ్రంగా నష్టపరుస్తుండగా శనగ, ఇతర పైర్లపైనా పచ్చపురుగు దాడి పెరిగింది. ఇప్పటికే ప్రధాన పంటలైన మిర్చి, కంది, పత్తి, పొగాకు, వరి పంటలకు ఈ తెగుళ్లు, పురుగుల దెబ్బకు తీవ్రంగా నష్టం జరుగుతుందని, ప్రస్తుత వాతావరణం ఇలాగే కొనసాగితే సగానికి సగం పంట ఉత్పత్తి తగ్గి నష్టపోతామని రైతులు వాపోతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 02:12 AM