Share News

అధ్వానంగా ‘పల్లెవనం’ నిర్వహణ

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:41 PM

దర్శి ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ పల్లెవనం పార్క్‌ నిర్వాహణ అధ్వానంగా మారింది. సిబ్బందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు పార్క్‌లోని ఆట వస్తువులు, పరికరాలను విరకొట్టారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్‌ పల్లెవనం పార్క్‌ అభివృద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి.

అధ్వానంగా ‘పల్లెవనం’ నిర్వహణ
విరిగిపోయిన ఊయల

సాయంత్రం పూట తెరచుకోని గేట్లు

రెండేళ్లుగా జీతాలు లేక సిబ్బంది అవస్థలు

ప్రజలకు ఆహ్లాదం కరువు

దర్శి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దర్శి ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ పల్లెవనం పార్క్‌ నిర్వాహణ అధ్వానంగా మారింది. సిబ్బందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు పార్క్‌లోని ఆట వస్తువులు, పరికరాలను విరకొట్టారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్‌ పల్లెవనం పార్క్‌ అభివృద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. నిధులు గోల్‌మాల్‌ విషయం బయట పడటంతో అటవీశాఖ అధికారులు తూతూమంత్రంగా పనులు చేశారు. నాసిరకం పరికరాలు ఏర్పాటుచేశారు. దీంతో పార్క్‌లో ఏడాది క్రితం ఏర్పాటుచేసిన టాయిలెట్స్‌ అప్పుడే విరిగిపోయాయి మరికొంత సామగ్రి కూడా దెబ్బతింది. ఆకతాయిలు అనేక ఆట వస్తువులను విరగకొట్టారు. చిన్నారులు ఆడుకునే ఊయల, మరికొన్ని వస్తువులను ఉద్దేశపూర్వకంగా పగులకొట్టారు. రెండేళ్లుగా సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవటంతో ఏమి చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. నిర్వాహణ చేయలేక సాయంత్రం పూట పార్క్‌ను తెరవటం లేదు. ఉదయం పూట కేవలం వాకర్స్‌కు మాత్రమే అనుమతిస్తున్నారు.

దర్శి పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన పార్క్‌ గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అటవీ సిబ్బందిలో ఆశలు చిగురించాయి. త్వరలో పెండింగ్‌ జీతాలు ఇస్తారనే నమ్మకంతో కొనసాగుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమస్యను గుర్తించి సిబ్బందికి జీతాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. పార్క్‌ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు పరికరాలను విరగొట్టిన ఆకతాయిలపై గత ప్రభుత్వం హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పరికరాలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 11:41 PM