12 నుంచి ప్రైవేటు మద్యంషాపులు
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:21 AM
జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానం త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12వ తేదీన ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.
నేటి నుంచి 9 వరకు దరఖాస్తులు
11న 3396 షాపులకు లాటరీ
దరఖాస్తు రుసుము 2 లక్షలు
లైసెన్స్ ఫీజులు 50 నుంచి 85 లక్షలుకొత్త పాలసీ నోటిఫికేషన్ విడుదల
అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానం త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12వ తేదీన ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు అనుగుణంగా మంగళవారం ఉదయం జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్‌లు జారీ చేస్తారు. 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ స్వీకరిస్తారు. ఈ విడతలో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయిస్తున్నారు. ఈ పాలసీ అనంతరం గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మరో 340 షాపులకు నోటిఫికేషన్ ఇస్తారు. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయదలచిన 12 ఎలైట్ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్ ఇస్తారు. కాగా మద్యం షాపులకు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అయినా దరఖాస్తులు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న లాటరీ జరుగుతుంది.
లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఒక రోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఆ వెంటనే 12వ తేదీ నుంచి ప్రైవేటు షాపులు తెరుచుకుంటాయి. వాస్తవానికి సోమవారంతో ప్రభుత్వ షాపుల పాలసీ గడువు ముగిసింది. అయితే ప్రైవేటు పాలసీ కొంత ఆలస్యమైనందున ప్రస్తుత పాలసీని 15వ తేదీ వరకు పొడిగించారు. ఈలోగా ప్రైవేటు షాపులు ప్రారంభమైతే ప్రభుత్వ షాపులు మూతపడతాయి. ఆ ప్రకారం 11వ తేదీ ప్రభుత్వ మద్యం షాపులకు చివరి రోజు అవుతుంది. ఆ రోజున లైసెన్సీలను ఎంపిక చేస్తారు కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ షాపులు ఉండవు.
భారీగా లైసెన్సు ఫీజులు
ఈసారి లైసెన్స్ ఫీజులను భారీగా పెంచారు. జనాభా ప్రాతిపదికన షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు. 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు 65 లక్షలు ఉంది. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ఠ ఫీజు రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను లైసెన్సీలు ఆరు విడతలుగా చెల్లించవచ్చు. అయితే లైసెన్స్ ఫీజులతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్‌ను ఈసారి రెట్టింపు చేశారు. గతంలో 10శాతం ఉంటే ఇప్పుడు 20శాతం మార్జిన్ వ్యాపారులకు వస్తుంది.