Andhra Pradesh: బాబోయ్.. మళ్లీ రెచ్చిపోతున్న కాల్‌మనీ గ్యాంగ్స్..
ABN , Publish Date - Oct 09 , 2024 | 06:01 PM
జిల్లాలో ఏలూరు నగరంతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మాత్రమే కొద్దిపాటి పెద్ద సెంటర్లు, మిగతా అంతా గ్రామీణ ప్రాంతమే. వ్యవసాయాధారిత గ్రామాల్లో కూలీలు, చిన్న వ్యాపారుల లక్ష్యంగా కాలనీ గ్యాంగ్లు అప్పులు ఇచ్చి మరీ వేధిస్తున్నారు.
ఏలూరు, అక్టోబరు 9: జిల్లాలో ఏలూరు నగరంతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మాత్రమే కొద్దిపాటి పెద్ద సెంటర్లు, మిగతా అంతా గ్రామీణ ప్రాంతమే. వ్యవసాయాధారిత గ్రామాల్లో కూలీలు, చిన్న వ్యాపారుల లక్ష్యంగా కాల్‌మనీ గ్యాంగ్‌లు అప్పులు ఇచ్చి మరీ వేధిస్తున్నారు. అయితే రోజువారీ తమ లాభాలను చూసుకుంటూ ఉంటారు. సామాన్యుల అవసరాలను ఆసరాగా తీసుకుని కొంతమంది వారం వారం వచ్చి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. ఆనక వారు వడ్డీ చెల్లించకపోతే రెట్టింపు వడ్డీ వేస్తూ పీడిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలపై ఏలూరులో కేసులు నమోదు కాగా కొంత కాలం పాటు అధిక వడ్డీలకు స్వస్తి పలికారు. కరోనా కాలంలో ఆర్థికంగా అన్ని వర్గాల వారు అతలాకుతలం అయిపోయారు. తిరిగి వ్యాపారాలను, కుటుంబాలను నిలబెట్టుకోవడానికి కొద్దిపాటి అప్పు చేస్తే ఎంత కట్టినా అప్పులు తీరలేదంటూ వేధిస్తున్నారు. సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాల్ మనీ గ్యాంగ్లకు భయపడుతున్నారు.
ఆ సామాజికవర్గం కార్యకలాపాలు..
గత ఐదేళ్ల వైసాపీ పాలనలో ప్రభుత్వం మాదే అని చెప్పుకునే ఒక సామాజిక వర్గం తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి వివిధ ప్రాంతాల్లో తిష్టవేశారు. ఈ ప్రాంతంలో కొంత మందిని అనుచరులుగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వారికి తామేమి తక్కువ కాదన్నట్లు జిల్లాలోని వడ్డీ వ్యాపారులు వారి బాణీలోనే నడవడం మొదలుపెట్టారు. గతంలో ఎవరైనా సొమ్ములు కట్టకపోతే వారిపై విశాఖపట్టణం, ఇతర ప్రాంతాల్లోనూ ప్రాంసరీ నోటు (ఎన్ఎస్ఐయాక్టు) కేసులు వేసేవారు. కోర్టు తీర్పు వల్ల ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వారి అడ్రస్సు ఉన్న ప్రాంతంలోనే కేసులు వేయాలని ఉండడంతో చివరకు కొంతవరకు బాధితులకు కేసులు ఒత్తిళ్ళు తగ్గింది. కేసుల వల్ల కాలయాపన కొనసాగుతుందని గమనించిన గ్యాంగ్‌లు వేకువజామునే ఇళ్ల వద్ద తిష్టవేసి ఇంట్లో ఖరీదైన వస్తువులను వడ్డీ జమ అంటూ దౌర్జన్యంగా పట్టుకుపోతున్నారు. మోటారు సైకిళ్ళు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, టీవీలను పట్టుకుపోతున్నారు. తమ వస్తువులు పోయాయని చెప్పుకుంటే ఎక్కడ పరువుపోతుందని భావించి దుఖాన్ని కళ్లల్లో కుక్కుకుంటూ రెండో కంటికి తెలియకుండా మరో అప్పుచేసి వడ్డీలను చెల్లించి వస్తువులను తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం రెండు రూపాయలు ధర్మవడ్డీగా చెబుతూ ఉంటారు.
ఒక్క వారం.. నూటికి రూ.20 వడ్డీ!
కాల్‌మనీ గ్యాంగ్‌లు వారానికి నూటికి రూ.20 వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు. కొంత మంది రోజువారీ నూటికి రూ.10 వడ్డీ వసూలు చేస్తుంటారు. వాస్తవానికి చిరువ్యాపారులు రూ.900 అప్పు తెచ్చుకుని సాయంత్రానికి రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తోంది. రూ.9 వేలు తీసుకుంటే సాయంత్రానికి రూ.10 వేలు ఒక్కరోజులోనే కట్టాల్సిందే. ఏలూరు నగరంతో పాటు జంగారెడ్డి గూడెం, నూజివీడు, చింతలపూడి మండల కేంద్రాల్లో కూడా వడ్డీ వ్యాపారులు చిన్న వ్యాపారుల నుంచి భారీ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎవరైనా సొమ్ములు చెల్లించకపోతే రాత్రివేళ చిరు వ్యాపారులను గదుల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి మరొకరిని షూరిటీ సంతకాలు పెట్టే వరకూ విడిచి పెట్టడంలేదని తెలుస్తోంది. ఏలూరులో ఉంటున్న మేడపాటి సుధాకర్ రెడ్డి అతని అనుచరులు లావణ్య, గూడవల్లి విద్యాసాగర్, మహ్మద్ అఖిల్ రెహమాన్, మరి కొందరి ఆగడాలకు అంతులేకపోవడంతో బాధితులు ఎమ్మెల్యే బడేటి చంటి వద్ద గోడు వెళ్ళబోసుకున్నారు. బాధితులతో కలిసి ఆయన ఎస్పీ కేపీఎస్ కిశోర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వన్ టౌన్, త్రి టౌన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. బాధితులు 45 మంది వరకూ ఉన్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను అసభ్యంగా మాట్లాడడం, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, చిన్న పిల్లలను అవమానపరిచారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గూడవల్లి విద్యాసాగర్, మహ్మద్ అఖిల్ రెహమాన్ ను ఈనెల 7న పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.
వడ్డీ వేధింపులపై ఫిర్యాదు చేయండి..
ఆధిక వడ్డీలతో ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ హితవుచెప్పారు. ‘జిల్లాలో ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. అప్పు కట్టడంలేదని వారిపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. చట్ట ప్రకారం కోర్టు ద్వారా ఇచ్చిన రుణాలను రాబట్టుకోవచ్చు. కొన్ని ఫిర్యాదులపై కేసులను నమోదు చేశాం. ముఠాలను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం’ అని అన్నారు.