Share News

Punganur : పుంగనూరులో హైటెన్షన్‌!

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:47 AM

వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరుకు రావడంతో హైటెన్షన్‌ నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు పథకం ప్రకారం దాడికి దిగారు.

Punganur : పుంగనూరులో హైటెన్షన్‌!

  • పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డి

  • మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో మకాం.. నేతిగుట్టపల్లి ‘రిజర్వాయర్‌’ పరిహారం కోసం వచ్చిన రైతులు

  • టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డెప్ప ఇల్లు దిగ్బంధం.. ముందే సిద్ధం చేసుకున్న రాళ్లు, బాటిళ్లు,

  • కర్రలతో మిథున్‌రెడ్డి బృందం దాడి.. ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు

  • దాడుల్లో కానిస్టేబుల్‌ సహా 12 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు.. 9 వాహనాలు ధ్వంసం

  • గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్‌మెన్‌.. పోలీసు బందోబస్తుతో తిరుపతికి మిథున్‌రెడ్డి

పుంగనూరు, జూలై 18: వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరుకు రావడంతో హైటెన్షన్‌ నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు పథకం ప్రకారం దాడికి దిగారు. పట్టణంలో అడుగుపెట్టేందుకు గతంలో ప్రయత్నించిన ఎంపీని రెండు సార్లు, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒకసారి టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.

ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు వారిని ఇక్కడకు రానివ్వలేదు. అయితే గురువారం మిథున్‌రెడ్డి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుపతి నుంచి తన అనుచరులతో కలిసి పుంగనూరులోని ఒంటిళ్లలో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. వైసీపీ ముఖ్య నేతలతో మాట్లాడి ఇటీవల ధ్వంసమైన ఇండోర్‌ షటిల్‌ కోర్టును పరిశీలిస్తారన్న సమాచారం బయటకు వచ్చింది.

పుంగనూరు మండలం నేతిగుట్లపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని, వైసీపీకి ఓట్లు వేస్తే సమస్య పరిష్కరిస్తామని మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ రావడంతో పరిహారం కోరేందుకు రైతులు టీడీపీ నేతలతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహం నుంచి రెడ్డెప్ప ఇంటికి ర్యాలీగా బయల్దేరారు. రిజర్వాయర్‌ రైతులకు న్యాయం చేయాలని, గో బ్యాక్‌ మిథున్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో వారు వేరే వీధుల గుండా రెడ్డెప్ప ఇంటికి చేరుకుని దిగ్బంధించారు. అయితే మిథున్‌రెడ్డితో పాటు తిరుపతి, సదుం, చిన్నగొట్టికల్లు, మదనపల్లె, పీలేరు నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు ముందుగానే రాళ్లు, కర్రలు, బాటిళ్లు సిద్ధం చేసుకుని ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు అక్కడకు రాగానే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలు, బాటిళ్లు, కుర్చీలతో టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. వారు కూడా ప్రతిఘటించారు.


ఈ క్రమంలో ఎస్టీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి, టీడీపీకి చెందిన అస్రఫ్‌, అజీం, నూర్‌షా, సుధాకర్‌, నాగరాజ, సుహిల్‌బాషా, వివేక్‌, షామిర్‌, ప్రసాద్‌స్వామి, సల్మాన్‌, సయ్యద్‌, పెద్దమోహన్‌నాయుడికి రక్తగాయాలయ్యాయి. ఇంకా కొందరు గాయపడ్డారు. అటు టీడీపీ కార్యకర్తలు రెడ్డెప్ప ఇంటిపై రాళ్లతో దాడి చేసి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, వైసీపీ నేతలకు చెందిన 9 వాహనాలను ధ్వంసం చేశారు. రెడ్డెప్పకు చెందిన స్కార్పియో వాహనాన్ని దహనం చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎంపీ గన్‌మెన్‌ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు మిథున్‌రెడ్డి మాజీ ఎంపీ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం 3.30కి చిత్తూరు ఏఎస్పీ ఆరీఫుల్లా తన వాహనంలో పోలీసు బందోబస్తు నడుమ మిథున్‌రెడ్డిని తిరుపతికి తరలించారు. రైతులకు పరిహారం ఇవ్వాలని కోరడానికి వస్తున్న టీడీపీ శ్రేణులపై అన్యాయంగా వైసీపీ రౌడీలు దాడులు చేశారని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి ఎం.శ్రీకాంత్‌, మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు మండిపడ్డారు.

గన్‌మెన్‌ కోసమే అల్లర్లు: టీడీపీ

పుంగనూరులో వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిని రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. తనకు ఎక్కువ మంది గన్‌మెన్‌ కావాలని అడగడం కోసమే ఎంపీ అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. అందరినీ బలి తీసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో వైసీపీ దాడులు పునరావృతం చేస్తే ప్రతి దాడులు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Updated Date - Jul 19 , 2024 | 07:04 AM