బొక్కలో ఎవరిని వేయాలి జగన్!?
ABN , Publish Date - Nov 08 , 2024 | 04:36 AM
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బొక్కలో ఎయ్యాలంట! ఎందుకంటే... ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ వేసిందట... ఇది మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉవాచ! బుధవారం రాత్రి నిద్రలో ఏం కలకన్నారో తెలియదు కానీ... గురువారం ఉదయాన్నే జగన్ ఈ ‘ఫేక్’ మాటలు చెప్పారు.
‘ఆంధ్రజ్యోతి’పై జగన్ ఫేక్ స్టేట్‌మెంట్
కడప ఎస్పీకి భారతి ఫోన్ చేసినట్లు
ఫేక్ న్యూస్ ప్రచురించారని అక్కసు
రాధాకృష్ణను బొక్కలో వేయాలని డిమాండ్
లేని విషయం ఉన్నట్లు జగన్ వ్యాఖ్యానం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బొక్కలో ఎయ్యాలంట! ఎందుకంటే... ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ వేసిందట... ఇది మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉవాచ! బుధవారం రాత్రి నిద్రలో ఏం కలకన్నారో తెలియదు కానీ... గురువారం ఉదయాన్నే జగన్ ఈ ‘ఫేక్’ మాటలు చెప్పారు. ఎప్పట్లాగానే తన భజన బృందంలాంటి మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రజ్యోతిలో ఈరోజు పొద్దున రాసినట్టున్నారు.. కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని! అది ఫేక్ న్యూస్ కదా మరి! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను బొక్కలో వేస్తున్నారా మరి! ఎయ్యాలి కదా మల్ల!’’ అని పోలీసులను ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, భారతీ రెడ్డి పీఏ, అవినాశ్ రెడ్డి అనుచరుడైన వర్రా రవీంద్రారెడ్డి ‘గ్రేట్ ఎస్కేప్’పై ‘ఆంధ్రజ్యోతి’ అనేక మార్గాల ద్వారా సమాచారం సేకరించి గురువారం సవివరమైన కథనం ప్రచురించింది. ఇందులో ఎక్కడా ‘కడప ఎస్పీకి భారతీరెడ్డి ఫోన్ చేశారు’ అనే మాట ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ లేదు. పత్రికలో ప్రచురితమైన ప్రతి అక్షరం అందరికీ ఒకేలా కనిపించింది. రవీంద్రా రెడ్డి భారతీరెడ్డి పీఏగా పనిచేశారని మాత్రమే ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించింది. అది ఫేక్ కాదు. కానీ... జగన్‌కు మాత్రం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించని, ఎవరికీ కనిపించని వాక్యాలు కనిపించాయి.
ఆయన అంతటితో ఆగలేదు. ‘ఆంధ్రజ్యోతి’పైనా, సంస్థ ఎండీ రాధాకృష్ణపైనా అక్కసు వెళ్లగక్కారు. అవినీతి సొమ్ముతో పత్రిక పెట్టి, దానికి చైర్మన్‌గా వ్యవహరించిన జగన్‌కు... పత్రికలో రాయని వాక్యాలు ఎలా కనిపించాయో, తన ఊహల్లో మెదిలిన వాక్యాలకు రాధాకృష్ణ ఎలా బాధ్యుడో ఆయనకే తెలియాలి! ‘ఫేక్ న్యూస్ వేసినందుకు రాధాకృష్ణను బొక్కలో వేయాలి’ అంటూ ఫేక్ స్టేట్‌మెంట్ ఇచ్చిన జగన్‌ను కదా బొక్కలో వేయాలి! ఈ ప్రెస్‌మీట్‌కు ‘ఆంధ్రజ్యోతి’నీ పిలిచి ఉంటే... విష యం అక్కడికక్కడే తేలిపోయేది. కానీ.. ఎదురు ప్రశ్నించని, చెప్పింది వినే మీడియా ప్రతినిధులతోనే ఆయన మాట్లాడతారు. సీఎంగా ఉన్నపుడూ అంతే, ప్రతిపక్షంలోకి వచ్చాకా అంతే! గత టీడీపీ ప్రభుత్వంలో డీఎస్పీల పదోన్నతులకు కులం ఆపాదించడంతో మొదలుకుని ‘నారాసుర రక్త చరిత్ర’ను దాటుకుని... తాజాగా విజయవాడ వరద సాయంపై తప్పుడు లెక్కల దాకా ఫేక్ న్యూస్ రాసింది, రాసేది జగన్ రోత పత్రికే! మరి... బొక్కలో వేయాల్సింది ఎవరిని... జగన్!