Share News

Rains: మళ్లీ వర్షం.. బుడమేరుకు వరద పెరిగే అవకాశం.. ఆందోళనలో జనం..

ABN , Publish Date - Sep 04 , 2024 | 09:21 AM

తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది.

Rains: మళ్లీ వర్షం.. బుడమేరుకు వరద పెరిగే అవకాశం.. ఆందోళనలో జనం..

పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏజెన్సీలో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాలలో సైతం కొండ వాగులు పొంగుతున్నాయి. పొంగుతున్న కొండవాగులు దాటే ప్రయత్నం చేయవద్దంటూ అధికారుల సూచనలు చేస్తున్నారు. పొంగిన కొండవాగుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొవ్వూరు నియోజకవర్గంలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు అంగన్వాడి సెంటర్లకు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.


ఇక విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మళ్ళీ తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వర్షాల కారణంగా విజయవాడ పూర్తిగా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంతో మళ్లీ వర్షం కురుస్తోందంటేనే విజయవాడ వాసులకు వెన్నులో వణుకు పుడుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు భయపడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. బాపట్ల జిల్లా కృష్ణా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. మళ్లీ వర్షంతో లంక గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వర్షం కురుస్తోంది. వరద తగ్గి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు ప్రజానీకాన్ని కలవరపెడుతున్నాయి.


ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి మైలవరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న మైలవరం, జి.కొండూరు మండలాల్లోని బుడమేరుపై వంతెనలు నిర్మించారు.

Updated Date - Sep 04 , 2024 | 09:21 AM