Share News

Ramayapatnam Port : అధికారుల తీరుకు నిరసనగా రైతు బలవన్మరణం

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:22 AM

రామాయపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణ ఓ రైతు ప్రాణం బలి తీసుకుంది. భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు పద్మావతి పరిహారం చెల్లింపులో తనకు అన్యాయం చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నెల్లూరు....

Ramayapatnam Port : అధికారుల తీరుకు నిరసనగా రైతు బలవన్మరణం

  • డిప్యూటీ కలెక్టరు వేధింపులే కారణమని ఆరోపణ

  • ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో

  • నెల్లూరు జిల్లా చేవూరులో విషాదం

గుడ్లూరు/కందుకూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రామాయపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణ ఓ రైతు ప్రాణం బలి తీసుకుంది. భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు పద్మావతి పరిహారం చెల్లింపులో తనకు అన్యాయం చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్‌కుమార్‌ (40) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కావలిలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు కారణాన్ని వివరించారు. చేవూరుకు చెందిన వినోద్‌ కుమార్‌ పిల్లల చదువు కోసం కావలిలో ఉంటున్నారు. ఆయనకు చేవూరులో 9.6 ఎకరాల భూమి ఉండగా రామాయపట్నం పోర్టు కోసం ఆ భూమిని సేకరించారు. ఇందులో 7 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన 2.6 ఎకరాలకు నిబంధనల ప్రకారం సుమారు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. పరిహారం చెల్లించాలని కావలి భూ సేకరణ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల 40 సెంట్లకు పరిహారం తన ఖాతాలో జమ అయినా వినోద్‌కుమార్‌ వెనక్కి ఇచ్చేశారు.

కాగా.. వినోద్‌కుమార్‌ ఆత్మహత్య విషయం తెలిసి కందుకూరు సబ్‌ కలెక్టరు శ్రీపూజ చేవూరుకు చేరుకుని మృతుని భార్య మౌనిక, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా చేవూరులో వినోద్‌కుమార్‌ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుని కుమారుడు, కుమార్తెలను ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన భార్య మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా రూ.50 వేల ఆర్థికసహాయం అందించారు. ఈ ఘటనపై కావలి టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 14 , 2024 | 04:22 AM