Share News

Jogi Ramesh: జోగి రమేష్ నివాసంలో ఏసీబీ దాడుల వెనుక రెవెన్యూ నివేదిక?

ABN , Publish Date - Aug 13 , 2024 | 09:54 AM

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.

Jogi Ramesh: జోగి రమేష్ నివాసంలో ఏసీబీ దాడుల వెనుక రెవెన్యూ నివేదిక?

అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. అయితే ఏసీబీ దాడుల వెనుక రెవెన్యూ నివేదిక ఒకటి ఉన్నట్టు సమాచారం. రెవెన్యూకు దొరకకుండా, రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి జోగి రమేష్ చక్రం తిప్పినట్టుగా సమాచారం. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగి బండారం బహిర్గతమైంది. జోగి మెడకు ఏసీబీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో దాదాపుగా సంవత్సరం క్రితమే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది. అంబాపురంలో సర్వే నంబర్ 88 లో 2 వేల 160 గజాల ఆగ్రిగోల్డ్ స్థలం ఉంది. దీనిని గతంలోనే సీఐడీ అటాచ్ చేసింది. నకిలీ రిజిస్ట్రేషన్ వేరే వారిపై చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్ కుట్ర చేసినట్టు రెవెన్యూ నివేదిక ఉంది. వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి సోదరుడు జోగి వెంకటేశ్వర రావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్ళీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వైసీపీ కార్పొరేటర్ శైలజారెడ్డికి జోగి బ్రదర్స్ అమ్మివేయడం జరిగింది. తమపై నెపం రాకుండా జోగి బ్రదర్స్ జాగ్రత్త పడ్డారు. సీఐడీ తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వెలువడ్డాయి.


ఏసీబీ అధికారుల అదుపులో జోగి రాజీవ్..

ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు సైతం చెబుతున్నారు. ఆయన ఒత్తిడితోనే స్థలం రిజిస్ట్రేషన్ జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తం 7 కోట్లు విలువైన స్థలం కబ్జాకు గురైందని అధికారులు లెక్క తేల్చారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా రాజీవ్ ఉన్నారు. ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు ఉన్నారు. జోగి రాజీవ్, జోగి వేంకటేశ్వర రావు ఇద్దరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మంత్రి హోదాలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఏవిధంగా ప్రభుత్వ నిబంధనలకు కాదని కాంట్రాక్ట్‌లు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు అరా తీస్తున్నారు.

Updated Date - Aug 13 , 2024 | 09:54 AM