Share News

SC sub-categorisation: నాడు చంద్రబాబు చొరవతో.. నేడు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌తో.. ఎస్సీ వర్గీకరణ అసలు చరిత్ర ఇదే..!

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:00 PM

మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

SC sub-categorisation: నాడు చంద్రబాబు చొరవతో.. నేడు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌తో.. ఎస్సీ వర్గీకరణ అసలు చరిత్ర ఇదే..!
Manda Krishna and Chandrababu

మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ.. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పు వెలువరించింది. ఒక కులంలో వర్గీకరణను రాజ్యాంగం అనుమతిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణపై 2004లో ఈవీ చిన్నయ్య జడ్జిమెంట్‌ను సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పక్కనపెట్టింది. సుప్రీం తీర్పుతో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది.

Manda Krishna and Chandrababu.jpg


సుదీర్ఘ పోరాటం..

ఎస్సీల్లో మాల, మాదిగ ఉప కులాలు ఉన్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో మాల సామాజిక వర్గం జనాభా ఎక్కువ. మాదిగ సామాజిక వర్గం జనాభా ఎక్కువ. తెలంగాణ ప్రాంతంలో అయితే మాదిగల జనాభా ఎక్కువ. ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాల ఉపకులానికి ఎక్కువ లబ్ధి చేకూరుతుందని, మాదిగలు నష్టపోతున్నారంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగలంతా ఉద్యమించారు. 1994లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితిని స్థాపించి.. సంస్థ ద్వారా ఎన్నో పోరాటాలు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం పోరాటాన్ని ప్రారంభించారు. సుదీర్ఘ ఉద్యమం తర్వాత మందకృష్ణ మాదిగ పోరాటానికి టీడీపీ అధినేత, అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని 1997లో హామీ ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్ని మాల మహానాడు వ్యతిరేకించింది. ఎస్సీల్లో మాల సామాజివర్గం టీడీపీ నిర్ణయంపై నిరసనలు చేపట్టింది. అయినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణను అమలు చేశారు.

Chandrababu and Manda Krishna.jpg


ఉమ్మడి ఏపీలో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 నుంచి 2004వరకు వర్గీకరణను అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారు. ఎమ్మార్పీఎస్‌ పోరాటం నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. నాలుగేళ్ల పాటు ఏపీలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేశారు. దీనిపై ఎస్సీల్లో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలును వ్యతిరేకిస్తూ మాలమహానాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లలో వర్గీకరణ రద్దు చేశారు. దీనిపై వివాదం సుప్రీం కోర్టును చేరింది. అప్పట్లో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాలలకు అనుకూలంగా తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని తెలిపింది. 2004 తీర్పు నేపథ్యంలో అప్పటినుంచి ఎస్సీ వర్గీకరణపై వివాదం కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ ఎన్నికల ప్రచార సభలో ఎస్సీ రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామని ప్రధామంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. చివరకు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలదేనంటూ సుప్రీం విస్తృత రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించడంతో ఇక ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది.


మరిన్ని ఏపీ, తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More AP and Telangana News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 04:00 PM