తిరుమలలో శారదా మఠాన్ని సీజ్ చేయాలి : శ్రీనివాసానంద సరస్వతి
ABN , Publish Date - Jun 30 , 2024 | 05:54 AM
తిరుమలలోని శారదా మఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో సాధువులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుపతి (జీవకోన)/తిరుమల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శారదా మఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో సాధువులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని శారదా మఠం వెనుకభాగంలోని 80 అడుగుల కాలవను పూడ్చి 20 అడుగులకు కుదించేసి అక్రమ కట్టడాలను నిర్మించిందని తెలిపారు.
తద్వారా భవిష్యత్తులో ఈ వాగుల ద్వారా వరదలు వస్తే భక్తులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తిరుమలలో తాము నిరసన తెలిపినా, అధికారులకు అనేకమార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. తమ విజ్ఞప్తిని స్వీకరించాల్సిన ఈవో శ్యామలరావు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో టీటీడీ అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా చలాయించారని, ఇక ఆ ఆటలు కట్టిపెట్టాలని సూచించారు. గత ఐదేళ్లలో పదికి పైగా మఠాల తరపున విలాసవంతమైన భవనాలను తిరుమలలో నిర్మించారని, ఏ నిబంధనల ప్రకారం వాటికి అనుమతులు ఇచ్చారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు.. తిరుమలలోని శారదామఠం అదనపు కట్టడాలపై వరుసగా వస్తున్న విమర్శల నేపథ్యంలో టీటీడీ స్పందించింది. శారదామఠం నిర్వాహకులు అదనంగా వినియోగించుకుంటున్న స్థలాన్ని 2019లోనే క్రమబద్ధీకరించామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.