Share News

YS Jagan: నాన్నకు మాటిచ్చి తప్పావ్‌..

ABN , Publish Date - Oct 24 , 2024 | 02:49 AM

తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులను తన మనుమడు, మనుమరాళ్లకు సమానంగా పంచాలన్న తమ తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆదేశాన్ని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధిక్కరించారని ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

YS Jagan: నాన్నకు మాటిచ్చి తప్పావ్‌..
YS Jagan

  • నైతికంగా పతనమయ్యావ్‌

  • అన్నపై షర్మిల ఫైర్‌..

  • జగన్‌కు ఘాటుగా లేఖాస్త్రం

  • తల్లి విజయలక్ష్మిపై కేసు పెట్టినందుకు ఆగ్రహం

  • తన పిల్లలకు ఆస్తులు పంచనందుకు ఆవేదన

  • ఆస్తులు మనుమడు, మనుమరాళ్లకు

  • సమానంగా ఇవ్వాలన్నది నాన్న ఆదేశం

  • పాటిస్తానని నాడు హామీ ఇచ్చి ధిక్కరించావు

  • ఎంవోయూలో లేకున్నా యలహంక ఆస్తిలో నాకూ

  • వాటా ఉంది.. అమ్మ సాక్షిగా మౌఖిక అంగీకారం

  • అమలుచేయకుంటే న్యాయపరమైన చర్యలు

  • షర్మిల హెచ్చరిక.. లేఖపై సంతకం చేసిన విజయలక్ష్మి

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులను తన మనుమడు, మనుమరాళ్లకు సమానంగా పంచాలన్న తమ తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆదేశాన్ని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధిక్కరించారని ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. తద్వారా నైతికంగా పతనమయ్యారని దుయ్యబట్టారు. తండ్రి అభీష్టం మేరకు ఆస్తులను సమానంగా పంచకపోతే.. న్యాయపరమైన చర్యలు తప్పవని ఓ లేఖలో హెచ్చరించారు. గత నెల 12న జగన్‌కు రాసిన ఈ లేఖను ఆమోదిస్తూ వారి తల్లి విజయలక్ష్మి కూడా సంతకం చేయడం విశేషం. తన మరణానికి ముందు ప్రారంభించిన భారతి సిమెంట్స్‌, సాక్షి, తదితర సంస్థల్లో మనుమడు, మనుమరాళ్లకు సమాన వాటా ఇవ్వాలని నాన్న సుస్పష్టంగా ఆదేశించారని.. అందుకు జగన్‌ కూడా అంగీకరించారని లేఖలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తమ మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు అమ్మ సాక్షి మాత్రమే కాదు.. వాటిని దగ్గరగా గమనించింది కూడానని తెలిపారు. తనకు జగన్‌ ఇటీవల రాసిన లేఖపై షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దానికి ఘాటుగా బదులిచ్చారు. షర్మిల లేఖలో ముఖ్యాంశాలివీ..


బుల్డోజ్‌ చేసుకుంటూ పోయావ్‌..

‘2019లో కుదిరిన ఎంవోయూలో పేర్కొన్నట్లుగా ‘ప్రేమాభిమానాలతో’ నాకు కొద్దిపాటి ఆస్తులు బదిలీ చేశారు. తద్వారా మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా మాత్రమే అమలు చేసినట్లు! పాక్షికం అని ఎందుకు చెబుతున్నానంటే.. భారతి సిమెంట్స్‌, సాక్షిలో మెజారిటీ వాటాలు నువ్వే ఉంచుకుంటానని ఒత్తిడి తెచ్చావ్‌.. నీదే పైచేయి కావడంతో అన్నీ బుల్డోజ్‌ చేసుకుంటూ పోయావ్‌.. అయినా ఎంవోయూలో ఉన్న ప్రకారం సెటిల్మెంట్‌కు అంగీకరించాం. నువ్వు నా అన్నవు కాబట్టి.. కుటుంబ వివాదాలను పరిష్కరించుకునే ఉద్దేశంతో సమాన వాటాను వదులుకునేందుకు నేను సమ్మతించాను. ఆ ప్రకారం 2019 ఆగస్టు 31న ఎంవోయూ అమలు చేశారు. కానీ కొద్ది ఆస్తులు మాత్రమే నాకు వచ్చాయి. ఇప్పుడు నీ సొంత తల్లిపైన కేసులు వేసి.. నీ చెల్లెలు, ఆమె పిల్లలకు చట్టబద్ధంగా రావలసిన ఆస్తులను రాకుండా చేయాలని చూస్తున్నావ్‌. నాన్న చూపిన దారిని తప్పి నువ్వు వ్యవహరించడం నాకు దిగ్ర్భాంతి కలిగిస్తోంది. నాన్న ఆకాంక్షలు, నీవిచ్చిన హామీకి విరుద్ధంగా సదరు ఎంవోయూను ఏకపక్షంగా రద్దుచేయాలని కోరావు. నీవు నాకు రాసిన లేఖ చట్టబద్ధంగా ఎంవోయూకు వ్యతిరేకం. అందులో పవిత్రత లేదు. ఆ లేఖ వెనుక ఉద్దేశమే నాకు విచారం కలిగిస్తోంది. మన తండ్రి ప్రతి ఆదర్శాన్నీ పక్కనపెట్టావ్‌. ఆయనెంతో ప్రేమించే భార్య, మన అమ్మపై కేసులు పెట్టడం.. నాకు, నా కుటుంబానికి చట్టబద్ధంగా రావలసిన ఆస్తులను లాక్కోవాలనుకోవడం.. నాన్న ఎన్నడూ ఊహించి ఉండరు.’


నా వాటాగా సరస్వతి పవర్‌..

‘ఎంవోయూ ప్రకారం నా వాటాగా వచ్చిన సరస్వతి పవర్‌కు సంబంధించిన షేర్లన్నీ దానిపై సంతకం చేసిన వెంటనే నాకు బదిలీచేస్తానని మాటిచ్చావు. కానీ ఏళ్ల తరబడి దానిని నిలబెట్టుకోలేదు. సరస్వతి పవర్‌ షేర్లపై అమ్మకు పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్డ్‌ డీడ్స్‌ను అమలు చేశావు. ఇప్పుడు దానిపై ఫిర్యాదులు చేయడం.. ఏడవడం సరికాదు. షేర్లు వదులుకోవడానికి అంగీకరించి.. ఇప్పుడు అనవసరమైన వివాదాలు రేపుతున్నావు. సరస్వతి పవర్‌లో చట్టబద్ధమైన వాటా కలిగి ఉన్న నాకు అది లేకుండా చేయడానికే ఇలా చేస్తున్నావు. 2019నాటి ఎంవోయూ విషయానికొస్తే.. అది కొనసాగుతోంది.. దానికి కట్టుబడి ఉండాల్సిందే. దాని నుంచి నువ్వు ఏకపక్షంగా బయటకు వస్తానంటే.. దానికి చట్టబద్ధంగా ప్రాధాన్యం లేదు. ఎంవోయూలో ప్రస్తావించిన ఆస్తులకు సంబంధించి అందులో పేర్కొన్న ప్రతి మాటకూ నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. ఎంవోయూలో ప్రస్తావించకపోయినా.. వీటిలో 20 ఎకరాల యలహంక హోం ప్రాపర్టీ కూడా ఉంది. అందులో కూడా నాకు వాటా ఉందని అమ్మ సాక్షిగా మౌఖికంగా అంగీకారం కుదిరింది.’


నన్ను నిర్దేశించలేవు..

‘నా రాజకీయ కెరీర్‌ నా ఇష్టం. పార్టీపరంగా నా ప్రవర్తనను నువ్వు నిర్దేశించలేవు. నీకు, అవినాశ్‌కు వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై మాట్లాడనంటూ ఓ క్లాజుపై సంతకం చేశానని.. దానికి కట్టుబడాల్సిందేనని నువ్వనడం హాస్యాస్పదం. ఇలాంటి ఆంక్ష పెట్టడం నిర్హేతుకం. నా పిల్లలు నీకు రక్తసంబంధీకులు. ఇష్టపూర్వకంగా నువ్వు సంతకం చేసిన ఎంవోయూను వారికోసం అమలు చేయడం నా అన్నగా నీ బాధ్యత. నైతికంగా పతనమైన నువ్వు.. ఇప్పటికైనా నాన్న ఆకాంక్షలను నెరవేరుస్తావని.. ఎంవోయూకు కట్టుబడి ఉంటావని ఆశిస్తున్నాను.. ప్రార్థిస్తున్నాను. లేదంటే చట్టబద్ధమైన పరిష్కారాలు అన్వేషించే హక్కులు నాకు పూర్తిగా ఉన్నాయి. ఈ వాస్తవాలను ధ్రువీకరించేందుకు, గత, వర్తమాన సంఘటనలకు సాక్షిగా ఉన్న మన అమ్మ కూడా దీనిపై సంతకం చేశారు’ అని షర్మిల తెలిపారు.


Also Read:

పోలవరం పరుగులు పెట్టాలి

జీజీహెచ్‌లో జగన్‌ రచ్చ

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 24 , 2024 | 07:23 AM