Share News

AP Government: వలంటీర్ల విషయమై ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..

ABN , Publish Date - Aug 01 , 2024 | 09:53 AM

వలంటీర్ల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థను కూడా నాటి సీఎం జగన్ విపరీతంగా నిర్లక్ష్యం చేసినట్టు కొత్త ప్రభుత్వం గుర్తించింది.

AP Government: వలంటీర్ల విషయమై ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..

అమరావతి: వలంటీర్ల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థను కూడా నాటి సీఎం జగన్ విపరీతంగా నిర్లక్ష్యం చేసినట్టు కొత్త ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది ఆగస్టులోనే వలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది. తాను అధికారంలో ఉన్నప్పుడే వలంటీర్ల వ్యవస్థకు కాలపరిమితి ముగిసినా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. వలంటీర్ల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం గత జగన్ సర్కార్ తీసుకోలేదు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకూ అక్రమంగానే వలంటీర్లు పని చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వలంటీర్లున్నారు. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్ల రాజీనామా/తొలగించనున్నారు. ప్రస్తుతమున్న వారితో నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై సర్కార్ లెక్కలేస్తోంది. వలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా రూ. 1848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.


సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోంది. గత నెలతో పాటు ఇవాళ కూడా సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో ఇక నుంచి వారితోనే పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని, అందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ మాత్రం పని అనేదే లేకుండా ఖాళీగా ఉన్న వలంటీర్లకూ టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వలంటీర్లు రాజీనామా చేశారు. మరికొందరు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో అలాగే ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్‌చార్ట్‌నూ అప్పగించలేదు. పైగా వలంటీర్లంతా సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు.


అయినా.. వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పని చేయకుండానే రెండో నెల జీతం తీసుకుంటున్నారు. మొదటి నెల పోనీ అనుకున్నా రెండో నెల కూడా పని చేయకుుండానే ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండన్నర లక్షల మంది వలంటీర్లు ఉండగా, ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. ఈ లెక్కన చూస్తే కనీసం లక్ష మందికి పైగా పని లేకుండానే ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున నెలకు సుమారుగా రూ.50 కోట్ల దాకా వైసీపీ కార్యకర్తలకు జీతాలుగా చెల్లిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం దీని కోసం వలంటీర్లును నియమించుకుని గత ఐదేళ్లలో రూ.7,600 కోట్లు ఖర్చు చేసింది. పింఛన్ల పంపిణీ తప్ప వలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాల్లేవు.

Updated Date - Aug 01 , 2024 | 09:53 AM