Share News

Sand Exploitation : నదులు గుల్ల

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:48 AM

కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కళ్లు గప్పి ఇసుక దోపిడీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదుల్లో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రెండు టన్నుల బకెట్‌ సామర్థ్యం గల జేసీబీలు ఉపయోగించి నదులను గుల్ల చేస్తూ ఇసుక తోడేస్తున్నారు.

Sand Exploitation : నదులు గుల్ల

  • కొందరు ప్రజాప్రతినిధుల ఇసుక దోపిడీ

  • కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్రలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

  • సీఎం హెచ్చరించినా మార్పులేదు.. తాజాగా పల్నాడులో వెలుగులోకి

  • పీఎస్‌కు 4 లారీలు తరలింపు.. ఇటీవల కర్నూలులో 6 టిప్పర్ల పట్టివేత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కళ్లు గప్పి ఇసుక దోపిడీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదుల్లో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రెండు టన్నుల బకెట్‌ సామర్థ్యం గల జేసీబీలు ఉపయోగించి నదులను గుల్ల చేస్తూ ఇసుక తోడేస్తున్నారు. తాజాగా కర్నూలు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నేతలు తమ స్వార్థం కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తూ నదీ గర్భాలను తోడేస్తున్నారు. చివరకు డీ సిల్టింగ్‌ పాయింట్లను కూడా పంచుకుని నదుల్లో ఇసుకను తరలించుకుపోతున్నారు.

బోట్స్‌మెన్‌ సొసైటీలకు మాత్రమే ఇచ్చే ఈ వర్క్‌ను కూడా చెరపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక దోపిడీ జరగడానికి వీల్లేదని ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. అయినా అక్రమాలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇసుకలో వేలు పెట్టొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కొందరిని మందలించారు కూడా. అయినానేతలు అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతున్నారు.

  • కర్నూలు, పల్నాడులో..

ఇటీవల కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్లను అధికారులు పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేయడంతో విడిచి పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఓ ప్రజాప్రతినిధి ఇసుక దోపిడీ నిర్వాకం బయటపడింది. రోజుకు సగటున 6 వేల టన్నుల ఇసుకను తరలించుకుపోతున్నారు.తన సోదరుడు, రౌడీషీట్‌ ఉన్న మరో ప్రధాన అనుచరుడిని ముందుపెట్టి ఈ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధి పాత్ర ఉండటంతో నియంత్రించేందుకు జంకుతున్నారు. నదిలో ఇసుక తోడే ప్రాంతానికి రోడ్డు వేసినా ఆ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు.


  • ముఖ్యమంత్రి హెచ్చరించినా...

నేతల ఇసుక దందాపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిఘా విభాగం రెండు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. ఉచిత ఇసుక పాలసీ ప్రకటించిన తర్వాత వాస్తవిక క్షేత్రస్థాయి పరిస్థితిపై ఓ నివేదిక ఇచ్చారు. కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక తో వ్యాపారం చేస్తున్నారని పేర్లతో సహా వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు చేశారు. అయినా వారు దోపిడీ ఆపలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రికి నిఘా విభాగం రెండో నివేదికను అందించినట్లు సమాచారం. కోస్తాంధ్రకు చెందిన ఓ కీలక మంత్రి సోదరుడు, మాజీ మంత్రి ఇద్దరూ కలిసి జాయింట్‌ వెంచర్‌ కింద ఇసుక వ్యాపారం చేస్తున్నారని ప్రస్తావించినట్లు తెలిసింది.

  • కోర్టులో కేసులు

గతంలో జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు నదులు, వాగులు, వంకలను వదిలి పెట్టకుండా ఇసుక వ్యాపారం చేశారు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌, హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు దాఖలయినా ఖాతరు చేయలేదు. ఇప్పటికే సుప్రీం కోర్టులో కలెక్టర్లు, ఇతర అధికారులపై ధిక్కరణ కేసులు నడుస్తున్నాయి.

Updated Date - Oct 11 , 2024 | 03:48 AM