Visakhapatnam : వేసవి నైరుతి!
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:07 AM
నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు తప్ప దక్షిణ భారతం మొత్తం విస్తరించాయి. అయినప్పటికీ ముసురు వాతావరణం కనిపించడం లేదు. పైగా వేసవి మాదిరిగా ఎండలు, వడగాడ్పులు కొనసాగుతున్నాయి.
రుతుపవనాలు వచ్చినా తగ్గని ఎండలు
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు తప్ప దక్షిణ భారతం మొత్తం విస్తరించాయి. అయినప్పటికీ ముసురు వాతావరణం కనిపించడం లేదు. పైగా వేసవి మాదిరిగా ఎండలు, వడగాడ్పులు కొనసాగుతున్నాయి. మే నెల వరకు ఎండ ఒక్కటే ఉంది. జూన్‌లో ఎండకు ఉక్కపోత తోడైంది. ఈ వాతావరణం తొలకరి పనులకు అవరోధంగా మారింది. రుతుపవనాల సీజన్‌లో పొరలు పొరలుగా మేఘాలు ఆవరించి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురవాలి. కానీ, అందుకు భిన్నంగా వేసవిలో మాదిరిగా క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి కొద్దిప్రాంతాల్లో రెండు, మూడు గంటల వ్యవధిలో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురుస్తోంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. వేడి సెగలు వస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడడం లేదు సరికదా మరింత వేడెక్కుతుంది. అందుకే ప్రస్తుత కాలాన్ని ‘వేసవి నైరుతి’గా పలువురు వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చే నైరుతి రుతుపవనాలు బలంగా లేకపోవడంతో పది రోజుల నుంచి విజయనగరం వద్దే నిలిచిపోయాయి. రెండు మూడు రోజుల్లో రుతుపవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.