సమ్మెకు సన్నద్ధం
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:40 PM
అత్యవసర సమయాల్లో రోగులు, క్షతగాతుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరించే 108 వాహన ఉద్యోగులు సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు.
- సమస్యలు పరిష్కరించాలని 108 వాహన సిబ్బంది డిమాండ్
- 25 అర్ధరాత్రి నుంచి సమ్మెబాట
నరసన్నపేట, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయాల్లో రోగులు, క్షతగాతుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరించే 108 వాహన ఉద్యోగులు సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈ నెల 25 అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్, డీఎంహెచ్‌వోకు సమ్మె నోటీసులు ఇవ్వగా.. తాజాగా గురువారం ఎంపీడీవోలు, తహసీల్దార్లకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా 108 అంబులెన్స్ వాహనాలు 31 ఉన్నాయి. 150 మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ఒక్కో వాహనంలో ఇద్దరేసి డ్రైవర్లు, ఈఎంటీలు విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సందర్భంలో 108 సర్వీసు ప్రొవెడర్లు కూడా మారుతున్నారు. నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సదరు సంస్థలు 108 ఉద్యోగుల గ్రాట్యూటీ, ఆర్జిత సెలవులకు నగదు, వార్షిక ఇంక్రిమెంట్లు వంటివి చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో 108 వాహన సేవలను ప్రభుత్వమే నిర్వహించాలని, తమకు కూడా ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని ఉద్యోగులు, సిబ్బంది కొన్నాళ్లుగా డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని, పోస్టులు భర్తీ చేసేటప్పుడు ప్రాధాన్యత మార్కులు ఇవ్వాలని కోరుతున్నారు. ‘2017లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబరు 49 ద్వారా జీతంతో సంబంధం లేకుండా 108 సిబ్బందికి సీఎఫ్‌ఎంఎస్ ఖాతా ద్వారా ప్రతి నెలా రూ.4వేలు అదనంగా మంజూరు అయ్యేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.4వేల అదనపు అలవెన్స్‌ను ఆపేశారు. వాటిని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాల’ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగే అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ.. 20 రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఈనెల 25 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించామని 108 వాహన సేవల కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు టి. విజయమోహన్, ప్రధాన కార్యాదర్శి ఎస్. నాగభూషణ తెలిపారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఎంపీడీవోలు, తహసీల్దార్లకు గురువారం సమ్మె నోటీసులు అందజేశామన్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యులకు కూడా సమ్మె నోటీసులు ఇచ్చామని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మరోసారి విజ్ఞప్తి చేశామని వివరించారు.