జీడి పిక్కల బస్తాకు రూ.16 వేల ధర ప్రకటించాలి
ABN , Publish Date - Jun 27 , 2024 | 11:59 PM
జీడిపిక్కల బస్తాకు రూ.16వేలు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతాంగ సమస్యల సాధన కమిటీ కోరింది.
- ఎమ్మెల్యే శిరీషను కోరిన రైతాంగ సమస్యల సాధన కమిటీ
పలాస: జీడిపిక్కల బస్తాకు రూ.16వేలు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతాంగ సమస్యల సాధన కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో జీడి పంటపైనే ఆధారపడి రైతులు బతుకుతున్నారని తెలిపారు. మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.9వేలు ధర ఉన్నపుడు రూ.వెయ్యి ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని చెప్పి ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నేరుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వంశధార కాలువను ఉద్దానం గ్రామాల మీదుగా ఇచ్ఛాపురం వరకూ పొడిగించాలని, రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు శిరీషకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం.మాధవరావు, కార్యదర్శి జి.చలపతిరావు, కోశాధికారి ఎం.ధర్మారావు, సింహాద్రి, గున్నయ్య, తవిటయ్య, దుర్యోధన, వీరాస్వామి పాల్గొన్నారు.
ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
పలాస నియోజకవర్గంలో సాగునీటి వనరులపై ఇరిగేషన్ అధికారులతో స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళింగదళ్, డబారుసింగి, దామోదర్‌సాగర్, వరహాలుగెడ్డ వంటి రిజర్వాయర్ల ప్రస్తుత పరిస్థితి ఏమిటని అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
వజ్రపుకొత్తూరు: పలాస నియోజకవర్గంలో అన్నిగ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. పెద్దమురహరిపురం పంచాయితీకి మంజూరైన ఎంపీ నిధులు రూ.22 లక్షలతో అభివృద్ధి పనులకు గురువారం ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గొరకల వసంతస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎంపీ నిధులు పలస నియోజకవర్గానికి మంజూరుకాకుండా మాజీ మంత్రి అప్పలరాజు అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సర్పంచ్‌లకు ఎలాంటి అధికారం, నిధులు అందించకుండా నాయకత్వం అడ్డుకుందన్నారు. అభివృద్ధి కోరుకునే సర్పంచ్‌లకు తాము పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పెద్దముమహరిపురంలో రోడ్డు విస్తరించాలని కోరగా నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు సూరాడ మోహనరావు, పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ, దున్న షణ్ముఖరావు, అరసవల్లి ఉమామహేశ్వరరావు, శశిభూషణ్, దుర్యోధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
హరిపురం: వైసీపీ ప్రభుత్వంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రేషన్ డీలర్లను ఆదుకొని సమస్యలు పరిష్కరించాలని మందస మండల డీలర్ల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వైఎస్‌ఎన్ మూర్తి, సీహెచ్ లక్ష్మణరావులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గౌతు శిరీషను గురువారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళి, శిష్టు బైరాగి, ప్రకాష్ పాత్రో, ఈశ్వరరావు, మోహనగౌడ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకరించండి
మందస: మందస పట్టణంలోని రాజాశ్రీనివాసా మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, దీని అభివృద్ధికి సహకరించాలని పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు ఎమ్మెల్యే గౌతు శిరీషకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, సీతారామశర్మ, శిష్టు సోమనాథం, ప్రభాకర పట్నాయక్, తిరుపతి సంహాచలం, శ్రీనివాస్, డి.తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీషను సత్కరించారు.