ఉద్యాన శాఖకు ఊతం!
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:45 PM
ఉద్యాన పంటలకు ఊతమిచ్చేలా.. మెట్ట ప్రాంతాల రైతులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉపాధిహామీ నిధులను ఉద్యానశాఖకు అనుసంధానం చేసి రైతులకు ఉపాధి కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
- రాయితీపై స్ర్పింక్లర్లు పంపిణీ
- రైతుల్లో హర్షం
మెళియాపుట్టి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం కుడ్డబ గ్రామానికి చెందిన పెద్దింటి లచ్చయ్య గత ఐదేళ్లుగా రాయితీపై స్ర్పింకర్లు పైపుల కోసం దరఖాస్తు చేసినా ఇవ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. రాయితీపై పైపులు ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
................
మెళియాపుట్టి మండలం కేరాశింగి పంచాయతీ నేలబొంతు గ్రామానికి చెందిన సవర దాసుకు రెండు ఎకరాలు మెట్టుభూమి ఉంది. అందులో అంతర పంటలు కూరగాయలు పండించాలనే ఉద్దేశంతో ఉద్యానవన శాఖ రాయితీపై పంపిణీ చేసే పైపుల కోసం మూడేళ్ల నుంచి దరఖాస్తు చేస్తున్నాడు. ఇంతవరకు పైపులు ఇవ్వక పోవడంతో ఇబ్బందులు పడ్డాడు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైపులు ఇవ్వడంతో సంబరపడుతున్నాడు.
................
ఉద్యాన పంటలకు ఊతమిచ్చేలా.. మెట్ట ప్రాంతాల రైతులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉపాధిహామీ నిధులను ఉద్యానశాఖకు అనుసంధానం చేసి రైతులకు ఉపాధి కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్‌లో రూ.3,469,47కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో అత్యధికంగా సూక్ష్మసేద్యానికి రూ.2,700కోట్లు కేటాయించారు. తాజాగా రాయితీపై పైపుల పంపిణీ చేస్తున్నారు.
- జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. అధికంగా గిరిజన ప్రాంతాల్లో సాగునీరు అందక వరి సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాల్లో నీటిని స్ర్పింకర్లు పైపులతో అందిస్తే పంటలు కాపాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై స్ర్పింకర్లు, పైపులు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులు దరఖాస్తుతోపాటు సబ్సిడీ పోను వారి వాటా నగదు చెల్లిస్తే.. వెంటనే పైపులు అందజేయనుంది.
- 63 ఎంఎం పైపులు రూ.23,984 కాగా రైతులు రాయితీ 55 శాతం అంటే 13,063 రాయితీ ఇస్తారు. రైతులు వాటాగా రూ.10,921 చెల్లించాలి.
- 75 ఎంఎం పైపులు రూ.27,078 కాగా రూ.14,749 రాయితీ వర్తిస్తుంది. రైతు వాటా రూ.12,331 చెల్లించాలి.
- 90 ఎంఎం పైపులు రూ.32,180 కాగా రాయితీ 15,022. రైతు వాటా 17,158 చెల్లించాలి.
- 110 ఎంఎం పైపులు రూ.50,598 కాగా రూ.16,009 రాయితీ వర్తిస్తుంది. రైతు వాటా రూ.34,590 కడితే 30 పైపులు 5 స్పింకర్లు అందజేస్తారు.
- ఇప్పటివరకూ 25మంది రైతులకు పైపులు అందజేశామని ఉద్యానవనశాఖాధికారి దుక్క శరత్‌రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పైపుల వల్ల నీరు వృథా కాకుండా కూరగాయలతో పాటు జీడి, మామిడి మొక్కలు పెంపకానికి ఉపయోగపడుతుందని తెలిపారు.