Share News

రణస్థలంలో భారీ ఫ్లై ఓవర్‌!

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:36 PM

రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి నుంచి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేసింది. టెండర్ల ప్రక్రియ సైతం దాదాపు కొలిక్కి వచ్చింది.

రణస్థలంలో భారీ ఫ్లై ఓవర్‌!
రణస్థలం వద్ద జాతీయరహదారి

- రెండు కిలోమీటర్ల వంతెన

- 800 మీటర్లు ఓపెన్‌గా..

- జనవరి నుంచి పనులు ప్రారంభం

- వైసీపీ చేయలేని పని కూటమి సర్కారు వచ్చాక కదలిక

- కేంద్రంపై ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడి

రణస్థలం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి నుంచి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేసింది. టెండర్ల ప్రక్రియ సైతం దాదాపు కొలిక్కి వచ్చింది. ఇక్కడ నిర్మించే ఫ్లైఓవర్‌ జాతీయ రహదారులకు సంబంధించి అతి పెద్ద వంతెనల్లో ఒకటిగా నిలవనుంది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌ కొనసాగుతుంది. మరో 800 మీటర్ల వరకూ ఓపెన్‌ ఫ్లైఓవర్‌ నిర్మించే అవకాశముంది. రణస్థలం సర్వీసు రోడ్డు ప్రారంభం నుంచి చివరి వరకూ ఫ్లైఓవర్‌ వస్తుంది. 45మీటర్ల పరిధిలో పనులు జరుగుతాయి. కొన్నేళ్ల కిందట నరసన్నపేట వరకూ ఆరులేన్ల రహదారి విస్తరణ జరిగినా.. రణస్థలం మండల కేంద్రం వద్ద అలానే వదిలేశారు. దీంతో మండల ప్రజలకు ఎదురుచూపులు తప్పలేదు.

- ఇదీ పరిస్థితి

విశాఖ నుంచి నరసన్నపేట వరకూ దాదాపు 135 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని ఆరు లేన్లగా విస్తరించారు. కానీ ఒక్క రణస్థలం మండల కేంద్రాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఆరు లేన్ల రహదారి నిర్మాణం పూర్తయింది. దీనిని జాతికి సైతం అంకితం చేశారు. కానీ రణస్థలం విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఆరేళ్లుగా సందిగ్ధత కొనసాగుతోంది. మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. అలాగని ఫ్లైఓవర్‌ నిర్మించలేదు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రణస్థలం మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి 2016లో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు కృషి మేరకు.. దన్నానపేట నుంచి లావేరు మండలం రావివలస వరకూ 3.5కిలోమీటర్ల మేర బైపాస్‌ నిర్మాణానికి నిర్ణయించారు. సుమారు 66 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూసేకరణ కూడా చేపట్టారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, ఎచ్చెర్లలో సేకరించిన భూములకు మాదిరిగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. మార్కెట్‌ ధర ప్రకారం సెంటు భూమికి రూ.2లక్షలకుపైగా చెల్లిస్తామని ప్రకటించారు. కానీ అప్పట్లో విపక్షంగా ఉన్న వైసీపీ నేతలు ఈ పరిహారం ఏమూలకు సరిపడదని.. దాని పెంచాలని డిమాండ్‌ చేశారు. దీంతో రణస్థలంలో రోడ్ల విస్తరణ ప్రక్రియ నిలిచిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారం విషయంలో మాట మార్చింది. సెంటుకు మొదటి అనుకున్నంత ధర ఇవ్వలేమని.. 30శాతం తగ్గించి ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. బైపాస్‌ నిర్మించాలంటే దాదాపు ఐదు చోట్ల వంతెనల నిర్మాణం చేపట్టాలి. రైతులకు పరిహారం చెల్లించాలి. ఈ మొత్తం లెక్కలు వేసుకున్న హైవే అథారిటీ అధికారులు మాత్రం రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికే మొగ్గు చూపారు. అప్పటికే రైతుల నుంచి సేకరించిన 66 ఎకరాలను తిరిగి వారికి అప్పగిస్తూ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేసింది.

- రెండేళ్ల కిందట సన్నాహాలు..

రెండేళ్ల కిందట రణస్థలం వద్ద రూ.200కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేశారు. టెండర్ల ప్రక్రియ ఖరారు అయినట్టు ప్రకటించారు. కానీ ఎందుకో పనులు ప్రారంభించ లేదు. అప్పట్లో వైసీపీ పాలకులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒత్తిడి చేయడంతో జాతీయ రహదారుల అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఫ్లైఓవర్‌ నిర్మాణంతో రణస్థలం ప్రాభవం కోల్పోతుందని స్థానికులు, వ్యాపారులు ఆందోళన చెందుతూ వచ్చారు. ఇక్కడ ఫ్లైఓవర్‌ వద్దంటూ ఆందోళనలు కూడా చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపై ఒత్తిడి కూడా పెరిగింది. ఈ తరుణంలో అటు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఉండేలా వంతెన నిర్మాణానికి నేషనల్‌ హైవే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఆశీలుమెట్ట తరహాలో భారీ స్తంభాలతో వంతెన ఏర్పాటుకు నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు మంగళవారం దన్నానపేట పెట్రోల్‌ బంకు వద్ద రోడ్డును హైవే అధికారులు పరిశీలించారు. కింద వ్యాపారాలకు అడ్డంకి లేకుండా.. వంతెనపై లారీలు, అంతర్‌ రాష్ట్ర వాహనాలు వెళ్లే వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. మొత్తానికి సీఎం చంద్రబాబు హయాంలోనే రణస్థలానికి ఫ్లైఓవర్‌ మంజూరు కావడం, నిర్మాణం సైతం ప్రారంభించనుండడంతో ఈ ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:36 PM