అధికారికంగా రథసప్తమి
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:55 PM
ఆరోగ్యప్రదాత.. ప్రత్యక్షదైవం.. అరసవల్లి శ్రీ సూర్యనా రాయణస్వామి రథసప్తమి వేడుకలు ఇకపై అధికారికంగా జరగనున్నాయి. ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
- రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
అరసవల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత.. ప్రత్యక్షదైవం.. అరసవల్లి శ్రీ సూర్యనా రాయణస్వామి రథసప్తమి వేడుకలు ఇకపై అధికారికంగా జరగనున్నాయి. ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్థానిక విశాఖ-ఏ కోలనీలోని తన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ‘అరసవల్లిలో ప్రతీ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో సూర్యదేవుని పుట్టిన రోజు(రథసప్తమి) వేడుకలను నిర్వహిస్తుంటాం. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామిని దర్శించుకుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాలను మూడు రోజుల రాష్ట్ర పండు గగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉంది. నా కృషి ఫలించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారా యణరెడ్డికి, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకి, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. అలాగే ప్రసాద్ పథకంలో భాగంగా ఆదిత్యా లయ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరు చేసిందన్నారు.