Share News

రాత్రివేళ.. గోడ దూకి..

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:47 PM

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. అంతవరకు వసతిగృహంలో ఉన్న ఆ ఇద్దరు ఆదివారం రాత్రి సుమారు 2.44 గంటల సమయంలో కళాశాల గోడదూకి అదృశ్యమైనట్లు సీసీ పుటేజీల్లో నమోదైంది.

రాత్రివేళ.. గోడ దూకి..
విద్యార్థినుల అదృశ్యంపై అరా తీస్తున్న ఎస్‌ఐ మధుసూదనరావు

- కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

- ఆలస్యంగా తెలుసుకున్న సిబ్బంది

- దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జి.సిగడాం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. అంతవరకు వసతిగృహంలో ఉన్న ఆ ఇద్దరు ఆదివారం రాత్రి సుమారు 2.44 గంటల సమయంలో కళాశాల గోడదూకి అదృశ్యమైనట్లు సీసీ పుటేజీల్లో నమోదైంది. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది ఆలస్యంగా గుర్తించడం.. ఆపై అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జి.సిగడాం మండలం ఆనందపురానికి చెందిన రెడ్డి భార్గవి, రాజాం మండలం వస్త్రపురి కాలనీకి చెందిన తలారి లిఖిత.. కేజీబీవీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. వీరిద్దరూ ఆదివారం రాత్రి కళాశాల గోడదూకి.. బయటకు వెళ్లిపోయారు. కానీ తిరిగిరాలేదు. కళాశాల సిబ్బంది సోమవారం ఉదయం 7 గంటల వరకూ ఆ ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైనట్టు గుర్తించలేదు. సీసీ పుటేజీలు పరిశీలించగా.. ఆదివారం రాత్రి 2.44 గంటల సమయంలో వారు కళాశాల గోడ దూకి బయటకు వెళ్లినట్టు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే రెడ్డి భార్గవి తల్లిదండ్రులు వలసజీవులు కావడంతో గుంటూరులో ఉంటున్నారు. అలాగే తలారి లిఖిత తల్లిదండ్రులు విషయం తెలిసి ఆందోళన చెందారు. లిఖిత తండ్రి వెంకటరమణ.. స్నేహితులకు, బంధువులకు సమాచారం అందించి.. కుమార్తె ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం అవుతున్నా ఆ ఇద్దరు విద్యార్థినులు తిరిగి రాకపోవడంతో కళాశాల సిబ్బంది.. జీసీడీవో సింహాద్రి నీరజకు కూడా సమాచారం అందజేయడంతో ఆమె కళాశాలను సందర్శించారు. విద్యార్థినుల అదృశ్యంపై కళాశాల ప్రత్యేకాధికారితో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. కానీ సమాచారం గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు దారితీసింది. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వై.మధుసూదనరావు, సిబ్బందితో పాటు కళాశాలకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. కళాశాల ప్రత్యేకాధికారిని ప్రమీల, సిబ్బందితో మాట్లాడారు. ప్రత్యేకాధికారిని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి, విద్యార్థినుల ఆచూకీపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి విద్యార్థినులు అదృశ్యం కాగా.. ఉదయం 7 గంటల వరకు ఆ విషయం సిబ్బందికి తెలియకపోవడం.. తెలిసినా మధ్యాహ్నం వరకూ గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ప్రయోజనం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:47 PM