Cyber crime డిజిటల్ అరెస్ట్‌పై జాగ్రత్త
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:14 AM
Digital Arrests సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట దోచుకుంటున్నారు. విదేశాల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు, కోటేశ్వరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల్లో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ మోసాలు అధికమవడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు.
విదేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న వారి తల్లిదండ్రులే టార్గెట్
డ్రగ్ పార్శిల్ వచ్చిందంటూ బెదిరింపులు
పోలీసు అధికారులమంటూ ఫేక్ అరెస్టు ఆర్డర్ కాపీలు
హడలిపోతున్న ప్రజలు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి):
ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బెన్‌హర్‌కు డిజిటల్ అరెస్టుకి సంబంధించిన ఫేక్ కోర్టు ఆర్డర్ కాపీ పంపించి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారు. ఈ ఫేక్ ఆర్డర్ కాపీకి జతగా డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పోలీసు సంతకాలతో ఓ లెటర్ పంపించారు. చిన్నపిల్లల నీలి చిత్రాలు తీశారంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై ఆయన సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో జిల్లాలో మరికొన్ని ఘటనలు జరగ్గా.. పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదు. కాగా.. డిజిటల్ అరెస్టుపై జాగ్రత్తగా ఉండాలని, బాధితులు వెంటనే సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
.....................
సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట దోచుకుంటున్నారు. విదేశాల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు, కోటేశ్వరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల్లో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ మోసాలు అధికమవడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ మోసాలకు బలైన వారు చాలామంది పరువుపోతుందని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలు కొనసాగిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పలు బహిరంగ సభల్లో డిజిటల్ అరెస్ట్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారంటే.. ఈ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హనీ ట్రాపింగ్ పేరుతో మహిళలు వీడియో కాల్స్ చేస్తూ.. నగ్నంగా కనిపించి.. ప్రజలను కూడా అదే తరహా ఉచ్చులోకి లాగి వీడియోను రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేసేవారు. ఇటీవల విశాఖపట్నంలో ఇటువంటి ఘటన వెలుగుచూసింది. అదే తరహాలో ప్రజల పరువుకు భంగం కలిగించేలా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుకు పాల్పడుతున్నారు. తాము పోలీసు అధికారులమని కొందరు, న్యాయమూర్తినని మరికొందరు, కొరియర్ బాయ్స్‌గా ఇంకొందరు.. ఇటువంటి మోసాలకు పాల్పడి పెద్ద మొత్తంలో నగదు దోచుకుంటున్నారు.
పోలీసులమంటూ నమ్మిస్తారు..
విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్ల సేకరిస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించి.. వారి తల్లిదండ్రులను ఫోన్ చేసి.. బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. తాము సీబీఐ, నార్కోటిక్స్, ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులమని బాధితులను నమ్మిస్తారు. ఆ అధికారుల సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోలీసుల ఫేక్ ఫొటోలు పెడతారు. విదేశాల్లో ఉన్న మీ పిల్లలను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ‘మీ అబ్బాయికి వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయి. మరికొద్ది క్షణాల్లో కస్టమ్స్ అధికారులు వచ్చి అరెస్టు చేస్తారు. ఈ అపాయం నుంచి మీ అబ్బాయి బయటపడాలంటే కొంత సొమ్ము చెల్లించాలి’ అని డిమాండ్ చేస్తారు. డిజిటల్ అరెస్టుకు సంబంధించిన ఫేక్ ఆర్డర్ కాపీలను సామాజిక మాధ్యమాల్లో పంపిస్తారు. విషయం బయటకు తెలిస్తే అరెస్టు తప్పదని, ఇదంతా క్షణాల్లో జరిగే ప్రక్రియని.. అరెస్ట్ చేశాక చేసేదేమి లేదని భయపెడతారు. డిజిటల్ అరెస్ట్ చేయడంతోనే వారి వీసాలు రద్దవుతాయని, జైలుకు పంపిస్తామని చెప్పి భయపెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో కాల్‌లో అవతలి వ్యక్తి పోలీసు యూనిఫాంలో కనిపించడంతో అవన్నీ నిజమేనని చాలామంది నమ్మేస్తున్నారు. అరెస్టు అయితే.. సమాజంలో తమ పరువు పోతుందని, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఏదోలా తమ బిడ్డ బయటపడాలనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు అడిగింత సొమ్ము ఆన్‌లైన్‌లోనే వారు చెప్పిన ఖాతాకు జమ చేస్తున్నారు. తర్వాత అసలు విషయం కనుక్కుని.. తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. కాగా.. రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్న ప్రజలు ఈ మోసాలపై ఫిర్యాదుకు వెనుకంజ వేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందనే భయంతో.. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఫిర్యాదు చేయండి
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్లు ఫోన్ చేసి మీ పిల్లలపై కేసుందని డిజిటల్ అరెస్ట్ చేస్తామనేటప్పుడు సమీపంలో పోలీసులను సంప్రదించండి. ఆన్‌లైన్‌లో పోలీసులు అరెస్ట్ చేయడం జరగదు. నిజంగా కేసులుంటే ముందుగా నోటీసులు జారీ చేస్తాం. ఫిజికల్‌గా అందుబాటులో లేకపోతే పోలీసులు నివేదిక తీసుకుని కోర్టు అనుమతులు వచ్చాక న్యాయస్థానం సమక్షంలోనే విచారిస్తాం. నిజానికి పోలీసులు ఎవరూ వీడియోకాల్ చేసి కేసుల నుంచి తప్పిస్తామని చెప్పి డబ్బులు అడగరు. అలా అడిగితే ప్రజలు ధైర్యంగా వారి వివరాలు ఆరా తీయండి. వారు ఆన్‌లైన్‌లో ఉంటుండగానే డబ్బులు జమ చేయొద్దు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే.. 24గంటల్లోపు సమీప పోలీసులకు కానీ, సైబర్ సెల్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వండి. మీరు పంపించిన ఖాతాను సీజ్ చేయించండి. సైబర్ నేరగాళ్లు నిరుపేదలను టార్గెట్ చేసి వారి పేరు మీద డమ్మీ ఖాతాలు తెరిచి లావాదేవీలు చేస్తున్నారు. బ్యాంక్ అధికారులకు దీనిపై అవగాహన కల్పించాం. బ్యాంక్‌కు వచ్చి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసిన వారి వివరాలను పోలీసులకు అందించాలని సూచించాం. ముందు తల్లిదండ్రులకు.. పిల్లలపై నమ్మకం ఉండాలి. ఇటువంటి మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి.
- ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి