తెరపైకి భావనపాడు హార్బర్
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:46 PM
భావనపాడు సాగరతీరంలో హార్బర్ ప్రతిపాదన నాలుగు దశాబ్దాలుగా నలుగుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మత్స్యకారుల కల నెరవేర్చాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
- నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న వైనం
- 1983లో అప్పటి గవర్నర్‌చే శంకుస్థాపన
- ఆతర్వాత అవాంతరాలు.. పనులు నిలిపివేత
- కూటమి ప్రభుత్వం రాకతో మరోసారి కదలిక
- ఇటీవలే రెండు కేంద్ర బృందాలు పర్యటన
- మంత్రిపై ఆశలు పెట్టుకున్న మత్స్యకారులు
టెక్కలి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): భావనపాడు సాగరతీరంలో హార్బర్ ప్రతిపాదన నాలుగు దశాబ్దాలుగా నలుగుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మత్స్యకారుల కల నెరవేర్చాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. టెక్కలి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన హార్బర్ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించి కేంద్ర బృందాలను ఆ ప్రాంత పరిశీలనకు ఆహ్వానించారు. అక్టోబరు 28, 29 తేదీల్లో భావనపాడు హార్బర్ కోసం బెంగళూరు నుంచి సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్(సీఐసీఈటీ) డిప్యూటీ డైరెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే నవంబరు 2న నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీచెర్చ్ టీమ్ ప్రతినిధి సుధీర్‌కుమార్ బృందం భావనపాడు ప్రాంతంలో పర్యటించింది. రెండు బృందాలు ఈ ప్రాంతంలో గల ఇసుకదిబ్బలు, క్రిక్‌వాల్స్ పరిశీలించి స్థానికంగా ఉన్న మత్స్యకారులు, జిల్లా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడాయి.
హార్బర్ వ్యవహారం ఇదీ..
1983లో మార్చి 26న అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి భావనపాడు హార్బర్‌కు శంకుస్థాపన చేశారు. మత్స్యకారులకు అవసరమైన వేలం చావిడి, పెట్రోల్‌బంకు, లైట్‌హౌస్, విశ్రాంతి గృహం, రూ.3.50కోట్లతో 90 మీటర్ల దక్షిణగోడ, లంగర్ ప్లాట్‌ఫారం నిర్మాణం చేసి 1985లో ప్రారంభానికి సిద్ధం చేశారు. అదే సమయంలో దక్షిణ ముఖద్వారం వద్ద ఇసుక మేట వేసింది. ఈ మేటల్ని తొలగించేందుకు అప్పటి మత్స్యశాఖ కమిషనర్ రస్కోగి నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. అప్పటికే నిర్మాణమైన 90మీటర్ల దక్షిణగోడను మరో 60 మీటర్లు పెంచాలని నిపుణుల బృందం సూచనల మేరకు కోటిన్నర రూపాయలు అదనంగా మంజూరు చేశారు. అయినా ఇసుకమేటలు తగ్గలేదు. దీంతో 1987లో పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి బృందం భావనపాడు భౌగోళిక పరిస్థితులు పరిశీలించింది. తూర్పు తీరంలో సెప్టెంబరు నెల నుంచి జనవరి నెల వరకు వచ్చే గాలులు ప్రభావంతో కెరటాల ద్వారా ఇసుక కొట్టుకు వస్తుందని గుర్తించి అక్కడ సాధ్యపడదని అప్పట్లో తేల్చి చెప్పింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1987 డిసెంబరు నెలలో విశాఖ నుంచి డ్రెడ్జర్ తెప్పించి ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిపించింది. డ్రెడ్జర్‌తో తవ్వకాలకు ఖర్చు ఎక్కువ కావడంతో ఆ పనులు సైతం పక్కన పడేశారు. అప్పటికి హరిశ్చంద్రాపురం శాసనసభ్యులుగా ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు హార్బర్ కోసం పట్టువీడలేదు. ఎలాగైనా పనులు జరిగేటట్లు చూడాలని నిధులు సైతం మంజూరు చేయించారు. ఆ తరువాత ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వెళ్లడం, హరిశ్చంద్రాపురం ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు గెలిచి.. అప్పటి ఎంపీ ఎర్రన్నాయుడు చొరవతో హార్బర్ పనులపై దృష్టి సారించారు. దీంతో మత్స్యశాఖ మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, జాయింట్ కలెక్టర్ సత్యన్నారాయణ, ఆర్డీవో నర్శింగరావు, ఇతర మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు భావనపాడు హార్బర్ సాధ్యాసాధ్యాల పరిశీలనకు పడవలో కొంతదూరం వెళ్లారు. దక్షిణ ముఖద్వారం చూసి తిరిగివస్తూ లంగర్ ప్రాంతానికి వచ్చేసరికి పడవ బోల్తాపడింది. స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. 1999లో టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచిన కొర్ల రేవతీపతి అసెంబ్లీలో భావనపాడు హార్బర్ సమస్య ప్రస్తావించినప్పటికీ దానిపై దృష్టిసారించే యంత్రాంగం కరువైంది. మొత్తం మీద 1999 నుంచి 2024 వరకు భావనపాడు హార్బర వ్యవహారం బాలారిష్టాలతో మూలకు చేరింది. అయితే ఈసారి టెక్కలి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు హార్బర్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు శ్రీకారం చుట్టడంతో మరోసారి తెరపైకి వచ్చింది. అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి, నేటి సాంకేతిక పరిజ్ఞానానికి బోలెడు సౌకర్యాలు పెరగడంతో ఈసారైనా హార్బర్ నిర్మాణం జరుగుతుందా? అని మత్స్యకారులు ఎదరుచూస్తున్నారు.