Share News

బాలల ఉజ్వల భవిష్యత్‌.. అందరి బాధ్యత

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:32 PM

‘బాలలకు ఉజ్వల భవిష్యత్‌ అందించే బాధ్యత మనందరిపై ఉంది. బాలలంతా పాఠశాలల్లోనే ఉండాలి. వారి హక్కులను పరిరక్షించాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు.

బాలల ఉజ్వల భవిష్యత్‌.. అందరి బాధ్యత
అరసవల్లి చిల్డ్రన్‌ హోమ్‌లో చిన్నారులతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘బాలలకు ఉజ్వల భవిష్యత్‌ అందించే బాధ్యత మనందరిపై ఉంది. బాలలంతా పాఠశాలల్లోనే ఉండాలి. వారి హక్కులను పరిరక్షించాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక అరసవల్లిలోని చిల్డ్రన్స్‌ హోమ్‌లో జిల్లా బాలల రక్షణ విభాగం(మిషన్‌ వాత్సల్య), మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాలల హక్కులు, బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెరిగేలా అవకాశాలు కల్పించాలి. బాలల హక్కులను రక్షిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదేన’ని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక దత్తత సంస్థ(శిశు గృహా)ను సందర్శించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ప్రతిపాదనలు పంపితే, నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, డీసీపీవో కేవీ రమణ, సూపరింటెండెంట్‌ పుణ్యవతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:32 PM