దళారుల దగా
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:48 PM
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. అన్నదాతలు దళారుల దగాకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ నెల 17 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆదేశించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు.
- ధాన్యం బస్తాకు రూ.400 తగ్గింపు
- నేటికీ తెరవని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
సరుబుజ్జిలి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. అన్నదాతలు దళారుల దగాకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ నెల 17 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆదేశించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో దళారులను ఆశ్రయించగా... ఇదే అదునుగా వారు దోపిడీకి పాల్పడుతున్నారు.
సరుబుజ్జిలి మండలంలో సుమారు 5,100 హెక్టార్లలో రైతులు వరిసాగు చేశారు. సంపత్, అమూల్య, స్వర్ణ, 1001, 1061, 1064 అనే ధాన్యం రకాలను పండించారు. వీటికి ప్రభుత్వం 82 కేజీల బస్తాకు రూ.1,840 మద్దతు ధర ప్రకటించింది. దీంతో రైతులు ఎంతో సంబరపడ్డారు. ఇటీవల అల్పపీడనం ప్రకటనతో కోతలు పూర్తిచేసి.. ధాన్యం విక్రయాలకు సిద్ధమయ్యారు. ఈ మండలంలో డీసీఎంస్, కొత్తకోట సహకార సంఘం, ఐకేపీ, జీఈసీఎస్, సీసీఎస్ స్పోర్ట్స్‌తో పాటు ఇసకలపాలెనికి చెందిన అయ్యప్ప రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొత్తం ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంతరవకూ ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. దీంతో రైతులు ధాన్యం భద్రపరిచే అవకాశం లేక దళారులకు విక్రయిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ.. దళారులు 82 కేజీల బస్తాకు రూ.1,430 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల వద్ద క్వింటాకు రూ.400 వరకూ దోచుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులకు భయపడి.. తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల ప్రక్రియ ముమ్మరం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి పద్మనాభం వద్ద ప్రస్తావించగా.. త్వరలో కొనుగోలు చేపడతామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా.. దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.