కోడ్ ఉల్లంఘించే వారిపై కేసులు
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:56 PM
‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి. కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాల’ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు.
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- అభ్యర్థులకు సువిధ ద్వారానే అనుమతులు
- కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్
కలెక్టరేట్, మార్చి 22 : ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి. కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాల’ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నోడల్, రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అమలు బృందాలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ఎంసీసీ, ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బృందాలు సంబంధిత ఆర్‌ఓ కిందనే పనిచేయాల్సి ఉంటుంది. క్షేత్రస్తాయిలో కోడ్ ఉల్లంఘన సంఘటనలకు స్థానిక అధికారులే బాధ్యత వహించాలి. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రచారం, వాహనాలు తదితరాలకు అనుమతులు తప్పనిసరి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యాక్రమాన్ని ముమ్మరం చేయాలి. ఓటరు కార్డుల పంపిణీ శతశాతం పూర్తి కావాలి. సి-విజిల్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి’ కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్‌కమర్, నహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్డీవో రంగయ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణీమోహన్, సీపీవో ప్రసన్నలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యకిరణ్, డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆడిట్ అధికారి సుల్తానా, సెబ్ అధికారి తిరుపతిరావు, ఔషధ నియంత్రణ శాఖాధికారి చంద్రరావు, సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, సమాచార, ఫౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, గడ్డెమ్మ, ఓబులేసు, నగేష్, చిట్టిరాజు పాల్గొన్నారు.
అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతాలు తప్పనిసరి
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతాలను తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి జేసీ నవీన్‌తో కలిసి జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘నామినేషన్‌కు ఒకరోజు ముందు కూడా అభ్యర్థులు తమ పేరున లేదా ఏజెంట్‌తోపాటు జాయింట్ ఖాతాలు ఏదైనా బ్యాంకు(సహకార బ్యాంకులతో సహా) లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. అభ్యర్థుల కోసం అన్ని బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ తెరిచి, ప్రాధాన్యతా ప్రాతిపదికన ఖాతాలో డిపాజిట్, ఉపసంహరణకు అనుమతించాలి. బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నగదు లావాదేవీలపై పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే బ్యాంకులు జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి. రూ.10లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా అయితే డీఈవోకు సమాచారం ఇవ్వాలి’ తెలిపారు. సమావేశంలో డీఈర్వో ఎం.గణపతిరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.సూర్యకిరణ్, యూనియన్ బ్యాంకు ఆర్‌ఎం ఎంవి.తిలక్, డీసీసీబీ సీఈవో వరప్రసాద్, గ్రామీణ వికాస్ బ్యాంకు ఆర్‌ఎం రాఘవేంద్ర, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.