Share News

దిద్దుబాటుకు శ్రీకారం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రీ సర్వే జరిగే గ్రామాల్లో మంగళవారం నుంచి రెవెన్యూ అధికారులు గ్రామసభలు ప్రారంభించారు.

దిద్దుబాటుకు శ్రీకారం
యారబాడు గ్రామసభలో రైతుల నుంచి వినతులు స్వీకరిస్తున్న అధికారులు

- గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వేలో తప్పులు

- సమస్యల పరిష్కారానికి చర్యలు

- రెవెన్యూ సభల్లో అర్జీల వెల్లువ

నరసన్నపేట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రీ సర్వే జరిగే గ్రామాల్లో మంగళవారం నుంచి రెవెన్యూ అధికారులు గ్రామసభలు ప్రారంభించారు. ఈ నెల 25 వరకూ వీటిని నిర్వహించి.. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కాగా.. తొలిరోజు గ్రామసభకు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 1,200 అర్జీలు వచ్చాయి. రీ-సర్వే సమయంలో భూముల విస్తీర్ణం పరంగా తక్కువగా నమోదు చేశారని.. న్యాయం చేయాలని పలువురు దరఖాస్తు చేశారు. రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఒకే వ్యక్తికి ఎక్కువ ఖాతాలు ఇస్తే.. వాటిని ఒకే ఖాతాగా మార్పు చేయాలని మరికొందరు కోరారు. మృతి చెందిన పట్టాదారుల భూమిని.. తమ పేరుతో మార్పు చేయాలని తగిన ఆధారాలతో వారసులు దరఖాస్తు చేశారు. భూ వర్గీకరణకు సంబంధించి తప్పుగా ఉంటే వాటిని మార్చడం, జాయింట్‌ ఎల్‌పీఎంగా నమోదైన వాటిని కూడా సబ్‌డివిజన్‌ చేసి సమస్య పరిష్కరించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. రికార్డుల్లో పేర్లు తప్పుగా నమోదయ్యాయని.. వాటిని సరిచేయాలని ఇంకొందరు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నరసన్నపేట మండలం యారబాడులో నిర్వహించిన గ్రామసభలో సుమారు 120 మంది రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందజేశారు. ఇలా ప్రతి మండలంలోనూ గ్రామసభల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

45 రోజుల్లో పరిష్కారం :

గ్రామసభల్లో వచ్చిన వినతులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల్లో పరిష్కారం చూపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ‘సరైన పత్రాలు సమర్పిస్తే.. మండల పరిధిలోనే వాటిని పరిష్కరిస్తాం. కొన్ని జేసీ దృష్టికి తీసుకెళ్తాం. ఇంకా పెద్ద సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తామ’ని వారు వివరించారు. రైతులు భూముల రికార్డుల తప్పుల సవరణకు ఈ సభలు వినియోగించుకోవాలని సూచించారు.

పేరు తప్పుతో రుణం రాలేదు

పాస్‌ పుస్తకంలో నా పేరు యారబాటి వెంకటప్పడుగా నమోదైంది. గత మూడేళ్లుగా బ్యాంకుల చుట్టూ రుణం కోసం వెళ్లినా.. పాస్‌బుక్‌లో పేరు మార్చుకుని రావాలన్నారు. ఈ గ్రామ సభల ద్వారా పేరు మార్పునకు అవకాశం లభించింది. అలాగే రెండు ఖాతాల్లో ఉన్నట్లు చూపుతున్నాయి. ఒకే ఖాతా చేయాలని అర్జీ ఇచ్చాను.

- యారబాటి వెంకటరమణ, యారబాడు

................................

ఉన్న భూమి తొలగించారు

గ్రామంలో 33-2లో ఉన్న 0.96 సెంట్ల భూమిని రీ-సర్వే సమయంలో తొలగించారు. వారసత్వంగా లభించే భూమి రికార్డుల్లో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డార. ఈ సమస్య పరిష్కరానికి అర్జీ చేశాం. రీ-సర్వేలో తప్పులపై గ్రామసభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించడం హర్షణీయం.

- లబ్బ అమ్మన్న, యారబాడు, నరసన్నపేట మండలం

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM