Share News

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:20 PM

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. సీటు పొందిన విద్యార్థులు ఉదయం 7 గంటలకే క్యాంపస్‌కు చేరుకున్నారు.

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌
విద్యార్థికి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న దృశ్యం

- తొలిరోజు 469 మంది విద్యార్థుల హాజరు

ఎచ్చెర్ల, జూలై 26: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. సీటు పొందిన విద్యార్థులు ఉదయం 7 గంటలకే క్యాంపస్‌కు చేరుకున్నారు. ఆర్జీయూకేటీ సెట్‌ అడ్మిషన్లు-2024 కన్వీనర్‌ డాక్టర్‌ ఎస్‌.అమరేంద్ర కుమార్‌ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు టోకెన్‌లు అందజేసి, సర్టిఫికెట్లను పరిశీలించారు. కుల, అకడమిక్‌ ధ్రువపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు, సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం, సర్టిఫికెట్ల సేకరణకు వేర్వేరుగా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి గుర్తింపు కార్డులను, ధ్రువీకరణ పత్రాలను అడ్మిషన్ల సెట్‌ కన్వీనర్‌తో పాటు క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ అందజేశారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కన్వీనర్‌ అమరేంద్రకుమార్‌ మాట్లాడుతూ ‘ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ఈ నెల 22న ప్రారంభమైన ప్రవేశాల కౌన్సెలింగ్‌ శనివారంతో ముగుస్తుంది. మిగులు సీట్ల వివరాలను ఇదే రోజు సాయంత్రం వెల్లడిస్తాం. ఇప్పటికే దరఖాస్తు చేసిన విద్యార్థుల మెరిట్‌ జాబితా ప్రకారం మిగులు సీట్ల భర్తీకి ఆగస్టు రెండో వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. వచ్చే నెల రెండో వారం లోపే తరగుతులు ప్రారంభిస్తాం. గతంతో పోలిస్తే ఈ ఏడాది అన్ని కేటగిరీల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి పోటీ తీవ్రమైంది. ఆర్జీయూకేటీలోని నాలుగు క్యాంపస్‌ల పరిధిలో 4,400 సీట్లు ఉండగా 4140 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. నాలుగు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 93శాతం, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 7శాతం సీట్లు కేటాయించాం. ఇందులో బాలికలు 67 శాతం, బాలురు 33 శాతం ఉన్నారు. ఫీజు రాయితీ లేని విద్యార్థులు పీయూసీ 1,2 సంవత్సరాలకు రూ.45వేలు చొప్పున, ఇంజనీరింగ్‌లో ఒక్కో ఏడాదికి రూ.50వేలు చొప్పున చెల్లించాలి’ అని తెలిపారు. క్యాంపస్‌ ప్రవేశాల కో-ఆర్డినేటర్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ ‘తొలిరోజు 515 మందిని కౌన్సెలింగ్‌కు ఆహ్వానించగా 469మంది హాజరయ్యారు. శనివారం 521మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంద’న్నారు. కార్యక్రమంలో క్యాంపస్‌ ఏవో ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ కొర్ల మోహనకృష్ణ చౌదరి, కోఆర్డినేటర్‌ కె.రమణ, పీఆర్వో మామిడి షణ్ముఖ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:20 PM