Share News

చి‘వరి’కి.. కన్నీరే

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:14 AM

వాయుగుండం... అన్నదాతల పాలిట వాయు‘గండం’గా మారింది. గత నాలుగు రోజుల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షాల కారణంగా వరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన వరి పంట చేతికి అందివచ్చిన సమయంలో.. వర్షాలు కురవడంతో తమకు చివరకు కన్నీరే మిగిలిందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

చి‘వరి’కి.. కన్నీరే
శ్రీకాకుళంలో నీటమునిగిన వరిపంట

- వాయుగుండం ప్రభావంతో వర్షాలు

- నీట మునిగిన పంట పొలాలు

- పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

శ్రీకాకుళం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వాయుగుండం... అన్నదాతల పాలిట వాయు‘గండం’గా మారింది. గత నాలుగు రోజుల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షాల కారణంగా వరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన వరి పంట చేతికి అందివచ్చిన సమయంలో.. వర్షాలు కురవడంతో తమకు చివరకు కన్నీరే మిగిలిందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షంతోపాటు ఈదురుగాలుల బీభత్సానికి ఉద్దానం ప్రాంతంలో కొంతమేర నష్టం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఇంకా కోతకు సిద్ధంగా ఉన్న వరిపైరు నేలకు ఒరిగిపోయింది. ఇక శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు పంటపొలాల్లో నిల్వ చేసిన వరి కుప్పలు తడిచి ముద్దయ్యాయి. పొలాల్లో నీరు నిల్వ చేరడంతో కోతకోసిన వరి కంకులు సైతం అక్కడక్కడా మొక్కలు మొలిచాయి. జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో వ్యవసాయశాస్త్రవేత్తలు బృందంతోపాటుగా.. జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు పలు ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా నష్ట నివేదిక అందకపోవడం.. రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో నష్టం ఎంతన్నదీ చెప్పలేమని వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామి వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రబీ సీజన్‌లో సాగుచేస్తున్న మినప, పెసలు పంటలు నీట మునిగాయి. ప్రస్తుతం వర్షం విడిచిపెట్టడంతో ఆదివారం నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వాస్తవాలను తెలుసుకోనున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:14 AM