Share News

హై అలర్ట్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:30 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. దీనికి ‘దానా’గా నామకరణం చేశారు. ఈ తుఫాన్‌ ఒడిశాలో తీరం దాటనుండడంతో.. జిల్లాపై పెద్దగా ప్రభావం చూపనుంది.

హై అలర్ట్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- ముంచుకొస్తున్న ‘దానా’ తుఫాన్‌

- ఒడిశాలో దాటనున్న తీరం

- నేడు, రేపు భారీ వర్షాలు

- జిల్లా మీదుగా రైళ్ల రాకపోకలు రద్దు

శ్రీకాకుళం/ కలెక్టరేట్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. దీనికి ‘దానా’గా నామకరణం చేశారు. ఈ తుఫాన్‌ ఒడిశాలో తీరం దాటనుండడంతో.. జిల్లాపై పెద్దగా ప్రభావం చూపనుంది. ‘బుధవారం భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు 60 కిలోమీటర్లు వేగవంతంగా ఉంటాయి. గురువారం రెట్టింపుతో ఉండే అవకాశముంద’ని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు తీరప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. రెండు రోజుల పాటు నదీపరివాహక ప్రాంతాలకు, సముద్రం వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం.. అత్యవసర సేవల్లో ఇబ్బందులు వాటిల్లకుండా... ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం జిల్లాకు రానున్నాయి.

- రైళ్ల రాకపోకలు రద్దు..

తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా మీదుగా ఒడిశా, పశ్చిమబెంగాళ్‌ నుంచి వచ్చే రైళ్లను బుఽధ, గురువారాల్లో రాకపోకలు రద్దు చేశారు. 23న ఇతర ప్రాంతాల్లో రైళ్లు బయల్దేరి... శ్రీకాకుళం జిల్లామీదుగా 24న పయనించే రైళ్లు రద్దు చేశారు. 24న పశ్చిమబెంగాళ్‌ రాష్ట్రంలో బయలుదేరే ఫలక్‌నామా, హౌరా-భువనేశ్వర్‌, హౌరా-తిరుచనాపల్లి, షాలిమర్‌-చెన్నై సెంట్రల్‌, షాలిమర్‌-హైదరాబాద్‌, ఖరగ్‌పూర్‌-విలుపురం, సంత్రాగచ్చి-మంగుళూరు, హౌరా-ఎస్‌ఎంవీఈ బెంగళూర్‌, వాస్కోడిగామా, హౌరా-చెన్నై, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌, పూరి-తిరుపతి వంటి రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ..‘జిల్లాలో నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తీరప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళంలో కంట్రోల్‌ రూమ్‌ 08942-240557 ఏర్పాటు చేశాం. ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్‌ చేస్తే సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారు. ముంపు ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అధికారులంతా అందుబాటులో ఉండాలి. పారిశుధ్యం విషయంలో జిల్లా పంచాయతీ అధికారి, మునిసిపల్‌ కమిషనర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల్లో ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

- ప్రత్యేకాధికారుల నియామకం...

తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని 11 తీరప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. రణస్థలం మండలానికి డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్‌ (8008803800), ఎచ్చెర్లకు డ్వామా పీడీ బి.సుధాకరరావు (8790008399), శ్రీకాకుళం మండలానికి డీపీవో కె.భారతి సౌజన్య (83414 93877), గారకు ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ(94408 14582), పోలాకికి జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజు (9100997770), సంతబొమ్మాళికి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఉమామహేశ్వరరావు (9866530885), వజ్రపుకొత్తూరుకు మత్స్య శాఖ డీడీ పీవీ శ్రీనివాసరావు (94407 16028), సోంపేటకు కార్మిక శాఖ ఏసీ అజయ్‌ కార్తికేయ (94925 55034), మందసకు పశుసంవర్థకశాఖ ఏడీ పి.చంద్రశేఖర్‌ (9492416700), కవిటికి ఉద్యానశాఖాధికా రి ఆర్వీ ప్రసాద్‌ (7995086758), ఇచ్ఛాపు రానికి డ్వామా ఏపీడీ సీహెచ్‌.శ్రీనివాసరెడ్డి (6309998070)లను తుఫాన్‌ పర్యవేక్షక అధికారులుగా నియమించారు. వీరితో పాటు జిల్లాలోని 30 మండలాల్లో తహసీల్దార్లు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:30 PM