ఫెంగల్.. ముంచేసింది
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:43 AM
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులు వర్షాలు కురిశాయి. పొలాల్లో వరిపనలు నీటమునిగాయి. నూర్పులు చేపట్టి కళ్లాల్లో దాచిన ధాన్యం తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- తుఫాన్ ప్రభావంతో నష్టం
- తడిచి ముద్దయిన ధాన్యం
- అన్నదాతల్లో ఆందోళన
నరసన్నపేట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి):
- నరసన్నపేట భవానీపురానికి చెందిన చిట్టి లక్ష్మీ.. 50 సెంట్ల పోలంలో వరిపంట కోత కోసి నూర్పులు చేశారు. తుఫాన్ ప్రభావంతో ధాన్యం గింజలు తడిచిపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని నరసన్నపేట సర్వీసు రోడ్డుపై ఆరబెట్టారు. కానీ అవి వినియోగపడతాయనే ఆశ లేదని వాపోతున్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
..........................
- బొడ్డవలసకు చెందిన సీహెచ్ మంజూ.. ఇటీవల వరిపంట నూర్పులు చేపట్టి.. కల్లంలో ధాన్యం భద్రపరిచారు. ప్రస్తుత తుఫాన్ ప్రభావంతో సుమారు 20 బస్తాల ధాన్యం తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్లు కప్పినా రంగు మారతాయనే ఉద్దేశంతో రోడ్డుపై ధాన్యం ఆరబెట్టామని తెలిపారు. వర్షాలు తగ్గితే కొన్ని గింజలు అయినా తినేందుకు పనికివస్తాయని పేర్కొన్నారు.
........................
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులు వర్షాలు కురిశాయి. పొలాల్లో వరిపనలు నీటమునిగాయి. నూర్పులు చేపట్టి కళ్లాల్లో దాచిన ధాన్యం తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నరసన్నపేట మండలంలో రెడ్డికపేట, కోమర్తి, దేవాది, మడపాం, కిళ్లాం, మాకివలస, జమ్ము, తామరాపల్లి, ఉర్లాం, సుందరాపురం, పారశెల్లి, సత్యవరం, కంబకాయి తదితర గ్రామాల్లో కోసిన వరిపైరు వర్షాలకు తడిసి ముద్దయింది. పచ్చి చేలు కుప్పలు పెట్టడంతో ధాన్యం రంగు మారుతుందని రైతులు గగ్గోలు చెందుతున్నారు. జమ్ము, భవానీపురం, కరగాం, నారాయణవలస తదితర గ్రామాల్లో కళ్లాల్లో ధాన్యం కిందకు నీరు చేరి మొక్కలు మొలిచాయి. జమ్ము గ్రామానికి చెందిన వాన గోవిందరాజు, వెలమల దాలమ్మ, కొత్తరెడ్డి రామారావు రైతులకు చెందిన 300 బస్తాలు ధాన్యం కళ్లాల్లో తడిచి దెబ్బతిన్నాయి. శనివారం ఉదయం నుంచి కాస్త తెరిపివ్వడంతో రోడ్లు మీద ధాన్యం ఆరబోశారు. అలాగే వరికుప్పల కింద నీటిని మళ్లిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు నిబంధనలను మరింత సడలించాలని రైతులు కోరుతున్నారు.