Share News

ఎలా జరిగిందో..

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:05 AM

లింగాలవలస సమీపంలో సర్వే నెం.71లో ఎర్త్‌స్ట్రెయిన్‌ గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. గ్రానైట్‌ క్వారీలో మేస్ర్తీగా పనిచేస్తున్న రావాడ అప్పారావు(44) శుక్రవారం విధులకు హాజరై అనారోగ్యానికి గురయ్యాడు.

ఎలా జరిగిందో..
రావాడ అప్పారావు(ఫైల్‌)

- గ్రానైట్‌ క్వారీ కార్మికుడి మృతి

- ఘటనపై అనుమానాలు

టెక్కలి, మార్చి 8: లింగాలవలస సమీపంలో సర్వే నెం.71లో ఎర్త్‌స్ట్రెయిన్‌ గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. గ్రానైట్‌ క్వారీలో మేస్ర్తీగా పనిచేస్తున్న రావాడ అప్పారావు(44) శుక్రవారం విధులకు హాజరై అనారోగ్యానికి గురయ్యాడు. తోటి సిబ్బంది ఆయనను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని క్వారీ యాజమాన్య ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు క్వారీలో కొందరు కార్మికులు బ్లాకును డ్రిల్‌ చేస్తుండగా.. పక్క నుంచి వెళ్తున్న అప్పారావు జారిపడి మృతి చెందాడని సిబ్బంది పేర్కొంటున్నారు. కాగా అప్పారావు సుమారు ఉదయం 11గంటలకు మృతి చెందగా.. సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ పి.పైడయ్య వద్ద ప్రస్తావించగా.. క్వారీలో కార్మికుడు మృతి చెందిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- అప్పారావు స్వగ్రామం కోటబొమ్మాళి మండలం రేగులపాడు. ఈయనకు తల్లి నారాయణమ్మ, భార్య పుణ్యవతి, పిల్లలు సుజాత, శివ ఉన్నారు. శుక్రవారం ఇంటి నుంచి విధులకు వెళ్లిన కొద్దిగంటల్లోనే అప్పారావు మృతి చెందాడని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రేగులపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.

- భద్రతా ప్రమాణాలు డొల్ల :

ఈ ఘటనతో గ్రానైట్‌ క్వారీలో భద్రతా ప్రమాణాల డొల్లతనం మరోసారి బట్టబయలైంది. సేఫ్టీమేనేజర్‌ స్థాయి ఉద్యోగులు క్వారీ నిర్వహణ పనులు పర్యవేక్షించాలి. కానీ ఆ పరిస్థితి పలు క్వారీల్లో కనిపించడం లేదు. రికార్డుల వరకు మాత్రమే సేఫ్టీ మేనేజర్‌ ఉద్యోగులు ఉన్నట్లు చూపుతున్నారు. క్వారీల్లో తరచూ ప్రమాదాలు జరగడం, మైన్స్‌ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 09 , 2024 | 12:05 AM